ఓ స్త్రీ రేపు రా!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి.

అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్‌. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా అదీ ఉత్తదేనని తేలిపోయింది. ప్రత్యేక హోదా కాదు కదా ప్యాకేజీ ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా లేదు. సెషన్ల వారీ పార్లమెంటు సమావేశాలు కూడా గడిచిపోతూనే ఉన్నాయ్‌. అయినా కేంద్రం నుంచి హామీలుగానీ, సరైన ప్రకటన గానీ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన పెరిగిపోతోంది. అది ప్రజా ప్రతినిథులపై ఒత్తిడి పెంచుతోంది. జిఎస్‌టి బిల్లుని పాస్‌ చేయించుకోవడం కోసం కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ, ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఫోన్‌లో తెలిపారట.

అయితే దాంట్లో నిజమెంతో ఎవరికీ తెలియదు. ఎందుకంటే సభలో ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించిన ప్రత్యేక హోదాకి దిక్కులేదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. జిఎస్‌టి బిల్లు ఈ రోజు పాస్‌ అయిపోతే రేపు, పార్లమెంటులో కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని టిడిపి విశ్వసిస్తోంది. ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే మళ్ళీ మళ్ళీ ఇది వాయిదా పడేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్‌.