కాంట్రవర్సీ కింగ్ కు బాబు ఎమ్మెల్సీ టికెట్

నేను పార‌ద‌ర్శ‌కంగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను అని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న చేత‌ల్లో మాత్రం ఈ రెండింటినీ చూపించ‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ టికెట్‌ల పంపకం జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీకి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని భావిస్తున్న వారికి బాబు వ‌రుస పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం వాకాటి నారాయ‌ణ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వ‌డం వివాదానికి దారితీస్తోంది. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉండి, ప్ర‌తి ప‌క్షంలో ఉండ‌గా కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న‌వారికి సైతం కాద‌ని ఇప్పుడు వాకాటికి బాబు టికెట్ కేటాయించ‌డం ఓ భాగ‌మైతే.. మ‌రో వివాదం కూడా తెర‌మీద‌కి వ‌చ్చింది.

వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పరారయ్యారని గత ఏడాది ఆరోపణలు వచ్చాయి.  ఏకంగా 720 కోట్ల మేరకు బ్యాంకులకు ఎగ్గొట్టారని… బ్యాంకుల నుంచి ఒత్తిడి రావడంతో పరారయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది.     పారిశ్రామికవేత్త అయిన నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఆ తరువాత టీడీపీలో చేరారు. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారట. వాటిని కొద్ది నెలలుగా చెల్లించకపోవడంతో వారంతా ఆయన కోసం వెతికారని టాక్.  ఒక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకే ఆయన ఏకంగా 203కోట్లు తిరిగి చెల్లించాలట. దీంతో ఆ బ్యాంకు బహిరంగ ప్రకటన కూడా జారీ చేసింది.

దీంతో ఇప్పుడు టీడీపీ త‌మ్ముళ్లే.. చంద్ర‌బాబు వైఖ‌రిపై లోలోన ర‌గిలిపోతున్నార‌ట‌. పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న త‌మ‌ను ప‌క్క‌న పెట్టి.. ఇలాంటి వాళ్ల‌కా టికెట్లు ఇచ్చేది అని వాళ్లు కామెంట్లు చేస్తున్నారంట‌. అంతేకాదు, ఇలాంటి వాళ్ల‌ను మండ‌లికి పంపించి బాబు ఏం సాధించాల‌ని అనుకుంటున్నారు? అంటూ ప్ర‌శ్న‌లు సైతం కురిపిస్తున్నార‌ట‌. మ‌రి బాబు వీరికి ఎలా స‌మాధానం చెబుతారో చూడాలి.