కాపు నేతలపైనే పవన్ కి మక్కువా..!

త‌న‌కు కుల‌, మ‌త‌, ప్రాంతీయ భేదాలు లేవ‌ని.. అన్యాయాన్ని ఎదిరిస్తాన‌ని, అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని రాజ‌కీయాల్లోకి రాక‌ముందు, వ‌చ్చిన త‌ర్వాత‌ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతున్నాడు. కానీ ఇవి మాట‌ల‌కే ప‌రిమితమా?  బాబు కేబినెట్‌లో కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు ఎంత అవినీతికి పాల్ప‌డుతున్నా వారిపై విమ‌ర్శ‌ల‌కు దిగ‌కుండా.. కేవ‌లం క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారిపైనే ప‌వన్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది!

ప్రెస్ మీట్ అయినా.. బ‌హిరంగ స‌భ అయినా జ‌న‌సేనాని టార్గెట్ మాత్రం క‌మ్మ సామాజిక వ‌ర్గ పెద్ద‌లేనా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.  ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కేంద్ర‌మంత్రులు వెంక‌య్య నాయుడు, సుజనా చౌద‌రి వారితో పాటు ఎంపీ రాయ‌పాటిపై తీవ్రంగా విమర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడును మొద‌ట్నించీ దోషిగా చూపిస్తూ వ‌చ్చిన ప‌వ‌న్‌.. త‌న దాడిని తీవ్రం చేశాడు. త‌న కుమార్తె స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌పై చూపించిన శ్ర‌ద్ధ ..ఏపీపై పెడితే బాగుంటుంద‌ని వెంక‌య్య‌కు చుర‌క‌లు అంటించారు ప‌వ‌న్‌.

మ‌రో కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రి అవినీతి అక్ర‌మాల ఫైలు ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో వైపు పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్ అయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ల‌క్ష్యంగా ఈ మ‌ధ్య కాలంలో తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా విష‌యంలో అనుస‌రిస్తున్న వైఖ‌రిని జ‌న‌సేనాని త‌ప్పుబ‌డుతున్నాడు.

పార్టీల‌కు అతీతంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ నేత‌ల‌పై ఆరోపణాస్త్రాలు సంధిస్తుండ‌టంతో ఆ సామాజిక‌వర్గంలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌వ‌న్ తీరుపై సోష‌ల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుప‌డుతోంది. ఏపీ ప్ర‌భుత్వంలోని కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన మంత్రులు నారాయ‌ణ‌, గంటా శ్రీనివాస‌రావు, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప వంటి వారిపైనా అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా..ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌డంలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై కొన్ని వ‌ర్గాలు మాత్రం ప‌వ‌న్‌పై కాపు ముద్ర ప‌డుతోందా అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.