కులాల వారీగా చీలుతున్న ఏపీ

ఏపీలో కులాల చీలిక‌లు పెరుగుతున్నాయా?  కొన్ని పార్టీల‌కు అనుకూలంగా కొన్ని, వాటికి వ్య‌తిరేకంగా కొన్ని కులాలు ఉంటున్నాయా?  అంటే .. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది!! ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ఈ కులాల కుంప‌ట్లు పెరుగుతున్నాయ‌నే చెప్పాలి. దీనికి ఎవ‌రిని నిందించినా.. త‌క్కువే అవుతుంది. రాజ‌కీయ నేత‌లు త‌మ త‌మ ఎన్నిక‌ల పండ‌గ‌ల కోసం కొన్ని కులాల‌కు అనుకూలంగా చేస్తున్న రాజ‌కీయ ర‌గ‌డ‌లు స‌మాజంలో పెద్ద ఎత్తున అంత‌రాన్ని సృష్టిస్తున్నాయి.

తాజాగా ఓ మీడియా సంస్థ ఏపీలో పాలిటిక్స్‌, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. స్టేట్‌లో హాట్ ఇష్యూ ఏం జ‌ర‌గ‌బోతోంది? వ‌ంటి అంశాల‌పై ప్ర‌ధానంగా స‌ర్వే చేసింది. ఈ క్ర‌మంలోనే అనేక విష‌యాలు వెలుగు చూశాయి. చంద్ర‌బాబుకు అనుకూలంగా ప్ర‌జ‌లు ఉన్నార‌ని తేల్చి చెప్పిన స‌ద‌రు మీడియా.. అదే స‌మ‌యంలో రాష్ట్రం కులాల వారీగా చీలుతోంద‌నే పెద్ద బాంబు పేల్చింది. వాస్త‌వానికి దీనిని విమ‌ర్శించే క‌న్నా.. దీనిలోని నిజాన్ని గ్ర‌హించాల్సి ఉంది. 2014 ఎన్నిక‌లే తీసుకుంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని హామీల‌ను ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనిదే కాపు రిజ‌ర్వేష‌న్‌. అయితే, అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌యినా.. దీనిపై అతీగ‌తీ లేక‌పోవ‌డం స‌హ‌జంగానే కాపు వ‌ర్గానికి ఆగ్ర‌హం క‌ల్పిస్తుంది. ఇక‌, మాదిక రిజ‌ర్వేష‌న్ విష‌యంలోనూ అనేక సైద్ధాంతిక విభేదాలు, త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ఉన్నాయి. ఒక‌ప్పుడు ప్రాంతీయ భేదాలున్న ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న త‌ర్వాత ఇలా.. కుల ప్రాతిప‌దిన విభేదాలు, చీలిక‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. కాపు సామాజిక వ‌ర్గం అంతా త‌మ‌కు న్యాయం చేసేవారికే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉంద‌ని స‌ర్వేలో తేల‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. ఇక‌, రెడ్డి, క‌మ్మ ఇలా సామాజిక వ‌ర్గాల వ‌ర్గాల వారీగా స్టేట్ చీలిపోతోంద‌ని తేల‌డం నిజంగానే విచారించాల్సిన విష‌యం.