కేసీఆర్ ఆత్మకథలో ఏముంది..!

తెలంగాణ ముద్దుబిడ్డ‌.. సీఎం కేసీఆర్.. త‌న రాజ‌కీయ జీవితానికి సంబంధించి ఆత్మ‌క‌థను అక్ష‌ర రూపంలో వెలుగులోకి తెస్తున్నార‌ట‌. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. సాధార‌ణంగా ఆత్మ‌క‌థ‌లు రాయ‌డం, పుస్త‌క రూపంలో తీసుకురావ‌డం కొత్త‌కాదు. మ‌హాత్మా గాంధీ మొద‌లుకుని అనేక మంది మేధావులు, మ‌హాత్ములు పుస్త‌కాలు రాశారు. కానీ, కేసీఆర్ కి వాళ్ల‌కి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది. సొంత దేశంలో స్వ‌ప‌రిపాల‌న కోసం చేసిన పోరుగా కేసీఆర్ సాగించిన తెలంగాణ ఉద్య‌మం నేడు చ‌రిత్ర పాఠ‌మైంది!

అదేవిధంగా ఆయ‌న అస‌లు కేసీఆర్‌ను తెలంగాణ ఉద్య‌మానికి ముందు, తెలంగాణ ఉద్య‌మానికి వెనుక అని చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. మా రాష్ట్రం.. మా పాల‌న పేరుతో ఆయ‌న జ‌నాల్లో బ‌ల‌మైన ముద్ర‌ను వేసిన ఫ‌లిత‌మే! వాస్త‌వానికి 1969లోనే తెలంగాణ ఉద్య‌మం పురుడు పోసుకున్నా.. దానిని సాధించిన ఘ‌న‌త కేసీఆర్‌కే సొంత‌మైంది. ఈ నేప‌థ్యంలో నిజానికి తెలంగాణ ఉద్య‌మానికి ముందు కేసీఆర్ రాజ‌కీయంగా చ‌క్రం తిప్పారు. అన్న ఎన్‌టీఆర్ హ‌యాంలోనే పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

అయినాకూడా .. దేశం అటుంచితే.. రాష్ట్ర‌వ్యాప్తంగా కేసీఆర్ ఎంత‌మందికి తెలుసు? అని ప్ర‌శ్నిస్తే.. ప‌దుల సంఖ్య‌లోనే స‌మాధానం వ‌స్తుంది. మంద‌లో క‌లిసిపోయిన మ‌నిషిమాదిరిగానే కేసీఆర్ ఉండేవారు. కానీ, తెలంగాణ ఉద్య‌మ ఊపుతో రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాటిన కేసీఆర్ పేరు దేశ పార్ల‌మెంటును కొన్ని సంవ‌త్స‌రాల పాటు క‌దిలించింది. అంత‌టి ఘ‌న కీర్తిని సొంతం చేసుకున్న కేసీఆర్‌.. రాష్ట్ర సాధ‌న త‌ర్వాత తానే సీఎం అయి.. మా పాల‌న‌, మా రాష్ట్రం అనే భావ‌న‌ను పాదుకొల్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న రాజ‌కీయ జీవితం గురించి పుస్త‌కం రాస్తున్నార‌నేస‌రికి స‌హ‌జంగానే ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంటుంది.

ముఖ్యంగా ఎన్‌టీఆర్ హ‌యాం నుంచి చంద్ర‌బాబు హ‌యాం వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ నేత‌గానే కేసీఆర్ ఉన్నారు. కాబ‌ట్టి ఆ విశేషాలు స‌హా తెలంగాణ ఉద్య‌మంలో త‌న అనుభ‌వాలు.. కేంద్రంలో మంత్రిగా ఉంటూనే కేంద్రంపై తిర‌గ‌బ‌డిన తీరు.. ప‌ద‌వుల‌ను తృణ‌ప్రాయంగా ప‌క్క‌న‌పెట్టిన వైనం వంటివ‌న్నీ అక్ష‌ర మాలిక‌లు కానున్నాయి. తెలంగాణ విష‌యంలో చంద్ర‌బాబు సహా ఘ‌న‌త వ‌హించిన నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఎలా ప్లేట్ ఫిరాయించారో?  సీఎంగా తొమ్మిదేళ్ల కాలంలో చంద్ర‌బాబు తెలంగాణ‌కు ఏంచేశారో?

దివంగ‌త వైఎస్ తెలంగాణ ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఏంటో? క‌లిసొచ్చిన వాళ్లు… క‌య్యానికి సిద్ధ‌మైన‌వాళ్లు.. అలా.. కేసీఆర్ త‌న అనుభ‌వాల‌ను పుస్త‌క‌రీక‌రించ‌నున్నారు. అంతేకాకుండా.. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను కూడా కేసీఆర్ దీనిలో పొందుప‌రిచే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ ఆత్మ‌క‌థ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి.. ఉత్కంఠ నెల‌కొన్నాయ‌న‌డంలో సందేహం లేదు.