కేసీఆర్ పై పోరుకు రేవంత్ కొత్త ఆయుధాలు!

తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే టీ టీడీపీకి చెందిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా త‌న ధాటిని మ‌రింత‌గా పెంచిన‌ట్టు తెలుస్తోంది. ఓటు కోట్లు కేసు త‌ర్వాత కేసీఆర్ త‌న‌ను కావాల‌నే జైలుకు పంపార‌ని ఆరోపిస్తూ.. గేమ్ స్టార్ట‌యింది! అంటూ పెద్ద ఎత్తున ప‌త్రిక‌ల‌కు స్టేట్ మెంట్ ఇచ్చిన రేవంత్ ఆ త‌ర్వాత త‌న దూకుడును పెంచాడు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి ప‌నినీ విమ‌ర్శిస్తూ.. త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు రేవంత్ ఎంతో ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఎంతైనా..బ‌లంగా ఉన్న అధికార ప‌క్షాన్ని ఢీకొట్టాలంటే సొంత పార్టీ తోడు అవ‌స‌రం. కానీ, ఈ  విష‌యంలో రేవంత్‌కు సొంత పార్టీ నుంచి ఆశించ‌న మేర‌కు స‌హాయం అంద‌డం లేదు.

దీంతో ఇప్పుడు ఆయ‌న పోరుకు క‌లిసి వ‌చ్చే కొత్త వారిని వెతుక్కుంటున్నారు. అయితే, ఇదేదో.. ప్ర‌తిప‌క్షాల‌ను కూడ‌గ‌ట్టుకుని పోరాటం చేస్తారేమో అనుకుంటే పొర‌పాటే.. ఇటీవ‌ల రేవంత్ దూకుడుకి సొంత నేత‌లే ఆయ‌న‌కు దూరం జ‌రుగుతుంటే.. బ‌య‌ట వారు ఎలా వ‌స్తారు? అందుకే.. మీడియాను త‌న పోరాటంలో భాగ‌స్వామ్యం చేసుకుని కేసీఆర్‌ని ఏకేస్తాన‌ని రేవంత్ చెబుతున్నాడు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేసీఆర్ అనుకూల వర్గం – వ్యతిరేక వర్గంగా చీలిపోయిందన్నాడు.

కేసీఆర్‌ని నిల‌దీయాల్సిన జాతీయ పార్టీ బీజేపీ కూడా కేసీఆర్ వేలు పట్టుకుని నడుస్తున్నట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎంఐఎం అయితే పూర్తిగా సరెండర్ అయిపోయింద‌ని విమ‌ర్శించారు. ఈ నేపథ్యంలో పేద ప్రజల పక్షాన టీడీపీ మాత్రమే పోరాటాలు చేయడానికి సిద్ధమవుతోందన్నారు. దీనికిగాను మీడియా సంస్థల అధినేతలందరినీ కలిసి ప్రజా సమస్యలపై పోరాటానికి వారి మద్దతును కూడా కోర‌తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు,  ప్రతిపక్షాలు బలహీన‌ప‌డినప్పుడు పాత్రికేయులే ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి ఉంటుందని మోత మోగించాడు రేవంత్‌.

దీంతో ఇప్పుడు ఈ విష‌యమే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏపీలో ప‌త్రిక‌లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తే.. విరుచుకుప‌డే టీడీపీ నేత‌లు.. దీనికి విరుద్ధంగా తెలంగాణ‌లో అధికార పార్టీపై వార్త‌లు రాసేందుకు ప‌త్రిక‌లను వాడుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం ఏమిట‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. సొంత పార్టీ నేత‌ల‌ను కూడ‌గ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న రేవంత్ ఇప్పుడు పాత్రికేయుల అండ‌గా పోరాటాలు చేస్తాన‌న‌డం విడ్డూరంగా ఉంద‌ని కూడా కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రి రేవంత్ ఎలా ముందుకు పోతాడో చూడాలి.