కేసీఆర్ సొంతోళ్ల లెక్క వేరేగా మ‌రి

తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్క‌లు వేరుగా ఉంటాయి. ఆయ‌న అనుకున్న‌ది సాధించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి! తెలంగాణ ఉద్య‌మం విష‌యంలో అయినా.. లేదా త‌న అనుకున్న  వ్య‌క్తుల విష‌యంలో అయినా.. కేసీఆర్ డిఫ‌రెంట్‌గా ఉంటారు. గ‌తంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సానియా మీర్జాను నియ‌మించారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా ఏమైందో ఏమో రెండు సార్లుగా రెండు కోట్లు ముట్ట జెప్పారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు స‌హా విప‌క్షాల నుంచి ప‌ద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా.. కేసీఆర్ లెక్క చేయ‌లేదు. త‌ను అనుకున్న‌ది చేసేశారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా దేశ‌ప‌తి శ్రీనివాస్ విష‌యంలోనూ కేసీఆర్ త‌ను అనుకున్న‌ది సాధించారు. అమ్మా తెలంగాణ‌మా ఆక‌లి కేక‌ల గాన‌మా అంటూ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పెద్ద ఎత్తున జ‌నాల‌ను కూడ‌గ‌ట్ట‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించారు దేశ‌ప‌తి. వాస్త‌వానికి ఆయ‌న ఓ టీచ‌ర్. అయినా కూడా క‌విగా, ర‌చ‌యిత‌గా పేరు తెచ్చుకున్నారు. త‌న ప‌దునైన విమ‌ర్శ‌లు, క‌విత‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేయ‌డంలో దేశ‌ప‌తి త‌ర్వాతే అని చెప్పేస్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని న‌ర‌న‌రాన జీర్ణించుకున్న దేశ ప‌తి అదే స‌మ‌యంలో కేసీఆర్ దృష్టిలో ప‌డ్డారు. దీంతో ఆయ‌న దేశ‌ప‌తిని చేర‌దీశారు.

కేసీఆర్ త‌న ప్ర‌తి స‌భ‌లోనూ దేశ‌ప‌తి పాట‌, మాట ఉండేలా చూశారంటే.. దేశ‌ప‌తి ప‌ట్ల కేసీఆర్ ఎంత‌గా అభిమానం పెంచుకున్నారో తెలుస్తుంది. రాష్ట్రం సాకారం అయ్యాక కూడా దేశ‌ప‌తిని కేసీఆర్ విడిచిపెట్ట‌లేదు. ఈ క్ర‌మంలోనే సీఎం కార్యాల‌యంలో ఓఎస్డీగా దేశ‌ప‌తిని నియ‌మించుకున్నారు. అయితే, సుప్రీం కోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో దేశ‌ప‌తి త‌న టీచ‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం తాజా ముచ్చట‌. దీంతో కేసీఆర్ పూర్తిస్థాయిలో త‌న‌కు ఓఎస్‌డీగా దేశ‌ప‌తిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు. కేసీఆర్ సొంతోళ్ల లెక్క‌వేరే అంటూ .. దేశ‌ప‌తిని త‌న ఆఫీస్‌లో అధికారికంగా నియ‌మించుకున్నారు కేసీఆర్‌. ఇదీ.. దేశ‌ప‌తి, కేసీఆర్‌ల ఉద్య‌మ బంధం!!