చంద్రబాబును దాటేసిన కేసీఆర్ వృద్ధి లెక్కలు!

దేశంలో ఓ ప‌క్క నోట్ల ర‌ద్దు దెబ్బ‌కి ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప కూలింది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లూ ఇబ్బందుల్లో ప‌డ్డాయి. అంతేకాదు, నోట్ల ర‌ద్దుతో తెలంగాణ ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతోంద‌ని పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఆరోపించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆ త‌ర్వాత మాట మార్చారు. అయితే, తాజాగా ఆయ‌న లెక్క‌లు కూడా మార్చార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ 2016-17 సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర వృద్ధి రేటు లెక్క‌లు వెల్ల‌డించారు. ఇవి చూస్తే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నిత్యం వ‌ల్లించే లెక్క‌ల‌ను దాటి పోయాయి. దేశంలో తెలంగాణ స్థాయిని ఇంకెవ్వ‌రూ అందుకునే ప‌రిస్థితి కూడా లేదు.

తెలంగాణ వృద్ధి రేటు 19.5% ఉంద‌ని వెల్ల‌డించారు సీఎం కేసీఆర్‌. ఇది అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం. గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా రెండంకెల వృద్ధి.. రెండంకెల వృద్ధి అంటూ పెద్ద ఎత్తున అధికారుల‌ను ప‌రుగులు పెట్టించిన ఏపీలోనే ఇది సాధ్యం కాలేదు. అలాంటిది తెలంగాణ‌లో సాధ్య‌మైంద‌న్నారు కేసీఆర్‌. వాస్త‌వానికి.. దేశ జాతీయ సగటు 7 శాతం కూడా దాటదని మొన్న బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. పెద్దనోట్ల రద్దుతో వివిధ రంగాలు కుదేలు అయిపోయిన నేపథ్యంలో ఇంతకు ముందు పెట్టుకున్నవృద్ధి రేటు అంచనాలను ఆర్థిక సర్వే సవరించింది.

7 శాతం లోపు అంటే 6.5శాతం కన్నా వృద్ధి రేటు తక్కువ ఉంటుందని చెప్పింది. అదే సమయంలో ఈ నోట్ల రద్దు ప్రభావం రాబోయే సంవత్సరాలలోనూ కొనసాగుతుందని, దేశ వృద్ధిరేటు వచ్చే ఏడాది 8శాతం వరకు ఉండవచ్చని చెప్పింది. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. గత ఏడాది తొలి అర్థభాగంలో  తెలంగాణ 9.24శాతంతో దేశంలో నాల్గవ స్థానంలో ఉంది. మరి ఇప్పుడు ఒక్కసారిగా 19.5శాతం వృద్ధిరేటు ఎలా సాధ్యమైందో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఒక వైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే శాఖలన్నీ నోట్ల రద్దు ప్రభావంతో కుదేలైపోయిన సమయంలో, ఏ రాష్ట్రానికీ సాధ్యం కాని రీతిలో ఇంత వృద్ధి సాధించడం సాధ్యమేనా…? మరి ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో ఏ ధీమాతో ఈ విధంగా చెప్పారు..?  ఇప్పుడు అంద‌రినీ ఆలోచింపచేస్తున్న ప్ర‌శ్న ఇదే! మ‌రి కేసీఆర్ ఏమంటారో చూడాలి.