చంద్రబాబు కి మెట్రో చీఫ్‌ శ్రీధరన్ షాక్!!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు గట్టి ఎదురుదెబ్బతాకింది. ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటానని ఢిల్లీ మెట్రో చీఫ్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎంతో చర్చ సాగింది. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై శ్రీధరన్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిధులు కేటాయించకుండా 2019 నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తామని ఆయన ప్రశ్నించారు. ‘ఇప్పటి వరకు సరిగా నిధులు, వసతులు కల్పించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాయైతే ఈ ప్రాజెక్టులో నేను కలిసి పనిచేయలేను. తప్పుకుంటాను’ అని ఆయన అన్నట్లు సమాచారం.

ఈ నెల నుంచి మెట్రో పనులు ప్రారంభమవుతాయని గతంలో శ్రీధరన్‌ చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇందుకు కావాల్సిన నిధులు, వసతులు కల్పించకపోవడ ంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ మెట్రోకు మొత్తం 6,823 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 60శాతం జైకా నిధులు ఇస్తుండంగా మిగిలిన 40శాతం నిధులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరించాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.866కోట్లు. మొదటి దశ కింద రూ.100కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఈ నిధులు కూడా ఇవ్వకపోవడంతో శ్రీధరన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రాజెక్టు సకాలంలో అవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు.