చంద్రబాబు సాధించుకొచ్చేస్తారట!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నేడు ఢిల్లీకి పయనమైన చంద్రబాబు, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమవుతారు. ఇంకో వైపున రేపు రాజ్యసభలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఓటింగ్‌ జరిగితే బిల్లు పాస్‌ అయిపోతుంది. ప్రత్యేక హోదా కోరుతూ పెట్టిన బిల్లు ఇది. దాన్ని అడ్డుకోవడానికి బిజెపి అప్పటికే అనేక వ్యూహాలను అమలు చేసింది.

ఆ బిల్లు సంగతి అలా ఉంచితే ప్రత్యేక హోదాపై సానుకూల ప్రకటన చేయవలసిందిగా అరుణ్‌ జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారట. అలాగే ప్రత్యేక రైల్వే జోన్‌ అంశాన్ని కూడా నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళాలని చంద్రబాబు ఓ నివేదిక కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇదివరకు 30 సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినా ఆయన ఉత్తచేతుల్తోనే తిరిగి వచ్చారు. ఆనాటి పరిస్థితులకీ ఈనాటి పరిస్థితులకీ ఎంతో మార్పు ఉంది. ఆ మార్పు దృష్ట్యా చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్‌ కొంత సానుకూల సంకేతాలు ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తోందని భావించవచ్చు. కానీ ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యంలోని బిజెపిని చంద్రబాబు ఒప్పించగలరా? అనే ప్రశ్న కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.