చిన్నమ్మకు షాక్: పన్నీర్ కు డీఎంకే మద్దతు

త‌మిళ‌నాట సంక్షోభం దిశ‌గా రాజ‌కీయాలు అడుగులు వేస్తున్నాయి. మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కేందుకు గ‌ల అన్ని అడ్డంకుల‌ను ఒక్కొక్కటిగా తొల‌గించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లూ శాంతి మార్గాన్ని ఎంచుకున్న మాజీ సీఎం, జ‌యకు న‌మ్మిన బంటు ప‌న్నీర్ సెల్వం ఒక్క‌సారిగా తిరుగుబాటు బావుగా ఎగ‌ర‌వేశారు. శశిక‌ళ‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా ఉందని చెప్ప‌డంతో శశిక‌ళ వ‌ర్గంలో గుబులు రేకెత్తించారు. అంతేగాక ఇప్పుడు డీఎంకే కూడా ప‌న్నీర్‌కు మ‌ద్దతు ఇస్తుంద‌ని చెప్ప‌డంతో శ‌శిక‌ళ‌కు గ‌ట్టి షాక్ త‌గిలే అవ‌కాశాలు లేక‌పోలేదు!!

అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి త‌న‌ను తప్పించడంపై పన్నీర్‌ సెల్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. `ఈ పదవి నాకు అమ్మ(జయ) ప్రసాదించింది. నన్ను తీసేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడను. మరి కొద్దిగంటల్లోనే నేనేంటో చూపిస్తా. వేచి చూడండి’ అని గర్హించారు. కాగా శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు పన్నీర్‌ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం పన్నీర్‌ క్యాంపులో 62 మంది ఎమ్మెల్యేలు చేరిన‌ట్లు స‌మాచారం. ఇదే ఊపులో ఢిల్లీ వెళ్లేందుకు కూడా పన్నీర్‌ సమాయత్తమ‌వుతున్నారు బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలుసుకుని, మంత్రివర్గ ఏర్పాటుపై వినపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టంగా తెలిసింది.

ఈ స‌మ‌యంలో శాస‌న సభలో బలనిరూపణ కీలక అంశంగా మారింది. 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి 8, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. సీఎం కావాలంటే కనీసం 117మంది మద్దతు అవసరం. ప్రస్తుతం ప‌న్నీర్ సెల్వానికి 62 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ఇప్పుడు డీఎంకేపై పన్నీర్ సెల్వం ఆశ‌లు పెట్టుకున్నారు!

‘ఉంటే, గింటే పన్నీర్‌ సెల్వమే సీఎంగా ఉండాలికానీ, శశికళను ప్రజలు స్వీకరించరు` అని ప్ర‌తిప‌క్ష నేత‌ స్టాలిన్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తద్వారా అడగకనే పన్నీర్‌కు తన మద్దతు ప్రకటించారు. శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని  స్టాలిన్ ప్రకటించిన విష‌యం తెలిసిందే! మ‌రి ఈ విష‌యంలో ప‌న్నీర్ సెల్వానికి స్టాలిన్ మ‌ద్ద‌తు ఇస్తే.. శ‌శిక‌ళ వ‌ర్గానికి ఇది గ‌ట్టి షాకే!!