జగన్,పవన్ మధ్యలో డీజీపీ

ప్రత్యేక హోదా మరో సారి రాజకీయ రంగు పులుముకుంటోంది.తమిళుల జల్లికట్టు స్ఫూర్తి తో ఆంధ్ర యువత కూడా ఈ నెల 26 న విశాఖ ఆర్ .కే బీచ్ లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.పిలుపునివ్వడం వరకు బాగానే వున్నా దానికి అటు జన సేన ఇటు వైసీపీ పార్టీ లు మద్దతు పలకడం తో సమస్యలు మొదలయ్యాయి.

ఆంధ్ర యువత స్వచ్ఛందంగా నిరసనకు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.అదీగాక ప్రజా స్వాత్మ్యం లో శాంతియుత నిరసన తెలియజేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది.దీనికి మొదటగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు పలికి ప్రాజలంతా ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ హోదాలో ఈ పిలుపునిచ్చింటే సమస్య లేదు కానీ ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఇందులో జోక్యం చేసుకోవడంతో రాజకీయ రంగు పులుముకుంది.

ఇక ముందునుండి ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతూ నిరసనలు..సభలూ పెడుతూ వస్తున్న వైసీపీ ఊరకే ఉంటుందా ఎక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని పవన్ హైజాక్ చేస్తాడో అని అధ్యక్షుడు జగన్ కూడా వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించాడు.అంతే కాదు స్పెషల్ గా కొవ్వొత్తుల ర్యాలీ కి కూడా పిలుపునిచ్చాడు.అంతటితో ఆగలా జగన్ తానే స్వయంగా నిరసనలో పాల్గొనబోతున్నట్టు ప్రకటించాడు.

అంతే ప్రభుత్వం ఒక్క సారిగా ఉలిక్కి పడింది.ఇప్పటి వరకు మీడియా ముసుగులో మరుగున పడేసి కప్పేసి ఉంచిన ప్రత్యేక హోదా అంశం మళ్ళీ బయటికి రావడం తో ఉక్కిరిబిక్కిరవుతోంది.ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తమిళుల పోరాటా స్ఫూర్తి కంటే తమిళ రాజకీయ నాయకుల పోరాట స్ఫూర్తి ని చూసి మన రాజకీయనాయకులు ఎంతైనా నేర్చుకోవాలి.

పాలక ప్రతిపక్షాలు కలిసి పోరాడుతాయి..పాలక పక్షం హస్తిన వేదికగా పావులు కదిపి సాధిస్తుంది.అది ఆరవ రాజకీయం.అదే మన విషయమైతే ప్రతి పక్షాలు పోరాడినా పాలక పక్షం నీరుగార్చేస్తుంది ..ఎక్కడ ప్రతిపక్షానికి మైలేజి వస్తుందో అని..ఇక హస్తినకు వెళ్లి ఉత్తర ప్రగల్బాలు పలుకుతూ మీడియా ముసుగులో కులుకుతూ కాలం వెళ్లదీస్తుంది మన పాలక పక్షం.

ఇక ఈ ఆర్.కే   బీచ్..జగన్..పవన్..ఇదంతా ఆపడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం అప్పుడే.ఆంధ్రప్రదేశ్ డీజీపీ తో ఈపాటికే ఈ నిరసనకు ఎటువంటి అనుమతి లేదని ,ఇప్పటి వరకు తమను ఎవరూ అనుమతి కోరలేదని,ఒక వేళా ఇప్పుడు కోరినా ఇంత తక్కువ సమయం లో అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు హోదా రాకపోయినా పర్లేదు కానీ అది ఎవరో పోరాడితే మాత్రం రాకూడదు ,అందుకే హోదా అంశానికి ముడిపడి ఏ చిన్న సెగ ఎగసిపడినా నీరుగార్చేస్తోంది బాబు అండ్ భజన మీడియా.