టీడీపీకి ఎర్తుపెట్టేలా వైకాపా ప్లాన్లు!

జ‌గ‌న్ నేతృత్వ‌లోని వైకాపా 2019 ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది! ఇప్ప‌టి నుంచే సంస్థాగ‌తంగా బ‌లం చేకూర్చుకోక‌పోతే.. పార్టీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన జ‌గ‌న్.. బ‌లంగా ఉన్న టీడీపీని దెబ్బ‌కొట్టేందుకు ప‌క్కా ప్లాన్ల‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు ర‌కాల వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. వాటిలో ప్ర‌ధాన‌మైంది.. టీడీపీ ప‌ట్టుకొమ్మ‌లుగా ఉన్న జిల్లాల్లో వైకాపా గాలి వీచేలా చేయ‌డం, రెండోది.. త‌న పార్టీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేల‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వ‌నించ‌డం, అదేస‌మ‌యంలో ఇత‌ర పార్టీల్లో సీనియ‌ర్లుగా ఉండి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతార‌ని భావిస్తున్న‌వారిని పార్టీలోకి చేర్చుకోవ‌డం.

ఈ రెండు ప్ర‌ధాన వ్యూహాల ద్వారా జ‌గ‌న్ త‌న పార్టీని ఎట్టిప‌రిస్థితిల‌నూ 2019లో అధికారంలోకి తీసుకురావ‌డం, తాను సీఎం సీటులో కూర్చోవ‌డం జ‌ర‌గాల‌ని ప‌క్కాగా నిర్ణ‌యించుకున్న‌ట్టు లోట‌స్‌పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి చంద్ర‌బాబు దెబ్బ‌కి ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలు ఊహించ‌ని విధంగా జ‌గ‌న్‌కి దెబ్బేశారు. అయినా కూడా జ‌గ‌న్ ఏ ఒక్క‌రినీ కించ ప‌రిచేలా మాట్లాడ‌లేదు. అయితే, చ‌ట్ట ప్ర‌కారం వారిపై వేటు వేయాల‌ని మాత్ర‌మే పోరాటం చేశారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబును విమ‌ర్శించాడే త‌ప్ప‌.. త‌న పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ల‌ని ప‌న్నెత్తు మాట అన‌లేదు. అంతేకాదు, తాను వాళ్లంద‌రినీ బాగానే చూసుకున్నాన‌ని, కానీ, చంద్ర‌బాబు ప్ర‌లోభ పెట్టార‌ని మాత్ర‌మే అన్నాడు జ‌గ‌న్‌.

ఈ నేప‌థ్యంలో పార్టీని విడిచి పెట్టి వెళ్లిన‌వాళ్ల‌కు తాను వ్య‌తిరేకం కాద‌నే సిగ్న‌ళ్లు ఆయ‌న పంపించారు. అంటే.. వాళ్లు.. మ‌ళ్లీ తిరిగి వైకాపాలోకి వ‌స్తే.. సాద‌రంగా ఆహ్వానించేందుకు జ‌గ‌న్ సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇదే విష‌యం బాహాటంగా చెబుతున్న వైకాపా ఎమ్మెల్యేలు. బాబు ఏదో చేస్తాడ‌ని వెళ్లిన వాళ్లు ఇప్పుడు అక్క‌డ ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని, వాళ్లు ఇప్పుడు బాబు న‌య‌వంచ‌న తెలుసుకున్నార‌ని, కాబ‌ట్టి తిరిగి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు సిద్ధంగానే ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వీళ్ల‌ని పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ రెడీ అవుతున్నారు.

అదేసమ‌యంలో టీడీపీకి బ‌లంగా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పుగోదావ‌రి, అనంత‌పురంలో వైకాపా జెండా రెప‌రెప‌లాడేలా కూడా చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఏ పార్టీలోనూ చేర‌నివారు, అదేవిధంగా ఆ పార్టీలో ఏదో సెంటిమెంట్ కోసం ఉన్నా.. మ‌న‌సంతా వేరే వేరే పార్టీల‌పై ఉన్న‌వాళ్ల‌ను కూడా త‌న పార్టీలోకి ఆహ్వానించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వైకాపా నుంచే ఆహ్వానాలు అందినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర‌లేద‌ని అంటున్నారు కొంద‌రు నేత‌లు. అంటే.. జ‌గ‌న్‌.. 2019 విజ‌య‌మే ల‌క్ష్యంగా గ‌తంలో చంద్ర‌బాబు అనుస‌రించిన ఫార్ములానే అనుస‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈఫార్ములా వ‌ర్క‌వుట్ అయితే, టీడీపీ ప‌రిస్థితి అంతేనా?! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.