టీడీపీతో అమీతుమీకి సిద్ధ‌మైన ప‌వ‌న్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మ‌రోసారి గ‌ర్జించాడు. ప్ర‌త్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధ‌మ‌య్యాడు! హోదా ఇస్తామని మాట త‌ప్పిన నాయ‌కుల‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డాడు. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో ఏపీ యువ‌త చేస్తున్న పోరాటాన్ని అణిచివేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. తాను ఏ ప‌రిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిర‌గాల్సి వ‌చ్చిందో వివ‌రించాడు. అంతేగాక త‌న‌ను విమ‌ర్శించే వారికి త‌గిన స‌మాధానం ఇచ్చాడు.

అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని, అందుకే కొత్త, అనుభ‌వ‌ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌ని ఆలోచించి.. టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుఇచ్చాన‌ని తెలిపారు. ఆ స‌మస్య‌ల‌ను అర్థం చేసుకుని, అనుభ‌వాల నుంచి మోడీ, చంద్ర‌బాబు పాఠాలు నేర్చుకుంటార‌నే స‌దుద్దేశంతోనే వారి జెండా మోసాన‌ని స్ప‌ష్టంచేశారు.`నాతో పాటు నన్ను నమ్మినవారందరూ, నన్ను ఫాలో అయిన వారందరూ మోశారు. కానీ వాళ్లు ఏదైతే మాటిచ్చారో, దాన్ని తప్పారు` అని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు.

కొన్ని దశాబ్దాలుగా మూలుగుతున్న సమస్యలను పరిష్కరించకుండా, డిలే చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చి, సమస్యలను పెంచడం వల్ల, అందుకు తనకు వచ్చిన ఆవేశం, ఆవేదనతోనే జనసేన పార్టీని పెట్టినట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయాలే కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు. `పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుడిని భూమ్మీదకు తెస్తాం అని ఆశలు కల్పించి, పదవుల్లోకి, అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోయి, కుంటిసాకులు చెప్పడం నచ్చలే`దని అన్నారు.

టీడీపీ, బీజేపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు తన అనుభవం గురించి ఎవరూ ప్రశ్నించలేదని, ఈ రోజు తాను ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటే తన రాజకీయ అనుభవం గురించి కొందరు మాట్టాడుతున్నారని పవన్ మండి పడ్డారు. దశాబ్దాలుగా పరిష్కారం చేయాల్సిన సమస్యలను పరిష్కరించక పోవటం వ‌ల్లే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు.. అవకాశవాద రాజకీయాలు తనకు నచ్చలేదని, అందుకే పార్టీ పెట్టానని పవన్ వివరించారు. మాట ఇచ్చ్చిన వాళ్ళు మాటతప్పారని అందుకే ప్రభుత్వాలని నిలదీస్తున్నామని పవన్ అన్నారు. ఇక ప‌వ‌న్ తాడోపేడో తేల్చుకోవ‌డానికి రెడీ అయినట్టేననేది విశ్లేష‌కుల అభిప్రాయం.