టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు హరికృష్ణ షాక్!

ఇటీవ‌ల కాలంలో అంత‌గా యాక్టివ్‌గా లేని ఏపీ సీఎం చంద్ర‌బాబు బావ‌, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు నంద‌మూరి హ‌రికృష్ణ‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారా? ఎలాంటి ప‌ద‌వీ లేకుండా ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న ఆయ‌న తిరిగి ఏదో ఒక ప‌ద‌విలో కూర్చునేందుకు రెడీ అవుతున్నారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. మొత్తంగా అటు స్థానిక‌, ఇటు శాస‌న స‌భ స్థానాలు 15 మందికి స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ ఆశావ‌హుల్లో ఎక్క‌డాలేని ఆశ‌లు, పోటీ పెరిగిపోయింది.

ప్ర‌స్తుతానికి ఓ ఎమ్మెల్సీ సీటు ఇప్ప‌టికే సీఎం త‌న‌యుడు లోకేష్‌కి రిజ‌ర్వ్ అయిపోయింది. ఇంక మిగిలిన 14 సీట్ల‌కు పోటీ భారీ స్థాయిలో క‌నిపిస్తోంది. అటు టీడీపీలో ముప్పై ఏళ్లుగా పాతుకుపోయి ఎలాంటి ప‌ద‌వుల‌కూ నోచుకోనివాళ్లు.. ఇప్పుడు ఎమ్మెల్సీల లైన్‌లోకి వ‌చ్చేశారు. ఇక‌, వైకాపా నుంచి జంపింగ్ చేసిన జిలానీల లెక్క ప‌క్కాగా ఉంద‌ని వినికిడి. ఈ నేప‌థ్యంలో ఇటు సొంత పార్టీ నేత‌లు, అటు జంపింగ్‌ల తాకిడి చంద్ర‌బాబుకి భారీ ఎత్తున తాకుతోంది. ఇదిలావుంటే, చంద్ర‌బాబుకి ఆయ‌న బావ నంద‌మూరి హ‌రికృష్ణ రూపంలో మ‌రో సెగ త‌గ‌లుతోంది.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న హ‌రి.. ఇప్పుడు స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. నిన్న విజ‌య‌వాడ‌లో ఎమ్మెల్సీల ఎంపిక విష‌యంపై చంద్ర‌బాబు పార్టీ పొలిట్ బ్యూరోతో గంట‌ల త‌ర‌బ‌డి భేటీ అయ్యారు. ఈ భేటీకి పిల‌వ‌ని పేరంటం మాదిరిగా హ‌రి ఎంట్రీ ఇచ్చాడ‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయాల‌ని బాబుపై ఒత్తిడి తెచ్చార‌ని స‌మాచారం.

బాబుపై స‌మ‌యానుకూలంగా మాట్లాడ‌డంతో మాట‌ల యుద్ధం చేయ‌డంలో హ‌రికి మించిన వారు లేరు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి హీటెక్కింది. ఒక ప‌క్క ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం, మ‌రోప‌క్క హ‌రికృష్ణ రూపంలో భారీ ఎత్తున ఒత్తిడి పెర‌గ‌డంతో బాబుకి త‌ల‌నొప్పి ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.