టీడీపీ లో ఫైటింగ్ … ఎత్తులు..పై ఎత్తులు

టీడీపీ బ‌లంగా ఉన్న అనంత‌పురం జిల్లాలో వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఆధిప‌త్య పోరు పార్టీని బ‌ల‌హీనం చేస్తోంది. ముఖ్యంగా  క‌దిరి ఎమ్మెల్యే, నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జి మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఏకంగా ఇన్‌చార్జి త‌ర‌ఫు నేత‌లంతా ఏకంగా పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించే స్థాయికి చేరుకుందంటేనే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ‌మ‌నించ‌వ‌చ్చు!!

కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా – నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ కందికుంట వెంకటప్రసాద్ ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు అక్కడి రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పేసిన చాంద్ బాషా వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి సొంత గూటికి చేరారు. అయితే త‌న‌ను ఓడించిన చాంద్ బాషాను పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారంటూ కందికుంట ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధినేత హామీతో వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని భావించారు.

బాషా పార్టీలోకి చేరినా… కందికుంట వర్గం ఆయనను ఎమ్మెల్యేగా అంగీకరించడం లేదు. దీంతో చాంద్ బాషా వైఖరిపై గుర్రుగా ఉన్న కందికుంట… టీడీపీలో ఉండలేక పార్టీని వీడలేక నానా అవస్థలు పడుతున్నట్లుగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో కదిరి నియోజకవర్గ పరిధిలోని తనకల్లు మండల కేంద్రంలో ఎంపీపీ ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో ఓ కీలక సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మి మాట్లాడిన తీరు టీడీపీకి షాకిచ్చేదే. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటున్నా… తన పదవుల కోసం పార్టీలు మారుతున్న చాంద్ బాషా లాంటి వారి వ్యవహార సరళితో ఏ ఒక్క టీడీపీ కార్యకర్త సంతోషంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలేమీ కనిపించడం లేదని తక్షణమే అందరం కలిసి టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేద్దామని పిలుపునిచ్చారు. దీనికి అంతా ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇదే జరిగితే… కదిరి నియోజకవర్గ పరిధిలోని ఇతర మండలాల టీడీపీ నేతలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. తనకల్లు మండలంలోని లక్ష్మి వర్గమంతా… కందికుంట వర్గంగానే ఉన్నారు. వీరు పార్టీకి రాజీనామాలు చేస్తే… కందికుంట వర్గంలోకి వారంతా కూడా ఇదే బాటన నడిచే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదే జరిగితే…కందికుంట కూడా టీడీపీకి గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.