టీడీపీ, వైసీపీకి బిగ్ ఫైట్.. సమ్మర్ పరీక్ష అదే

ఆంధ్రప్ర‌దేశ్‌లో మ‌రో బిగ్ ఫైట్‌కు తెర‌లేవ‌నుంది. ఎమ్మెల్సీల కోటాలో మొద‌లైన ఈ ఎన్నిక‌ల యుద్ధం.. ఇంకా కొన‌సాగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో పెండింగ్‌లో ఉన్న‌ మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మ‌ధ్య మ‌రో సంగ్రామం త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా రెండేళ్ల పాల‌న‌కు ఇవి రెఫ‌రెండంగా టీడీపీ భావిస్తుండ‌గా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల ప‌డాల‌ని వైసీపీ భావిస్తోంది.

సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ – కార్పొరేషన్లకు ఎన్నికలు జూన్ నెలలో జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కర్నూలు – తిరుపతి – శ్రీకాకుళం గ్రేటర్ విశాఖ – కాకినాడ – గుంటూరు – ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ల‌కు  ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే రాజంపేట – రాజమండ్రి. నెల్లిమర్ల – కందుకూరు మున్సిపాలిటీలు ఇలాగే తమ పాలకు కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో త్వరలో ముహుర్తుం ఖారారు కానుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ పరంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టి తద్వారా ఓట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంద‌ని టీడీపీ నాయకులు అంటున్నారు. 2019 ఎన్నికల మూడ్ వచ్చేసిన నేపథ్యంలో అధికార – ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయనేది నిపుణుల మాట. వీటి ఫ‌లితాల ఆధారంగా 2019 ఎన్నికల వ్యూహాన్ని టీడీపీ సిద్ధం చేసుకోవ చ్చ‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సైతం విపక్షంగా తమను ప్రజల ఎంత దగ్గర చేసుకున్నారనేది తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు సరైన మార్గమని అంటున్నారు.

బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా పదోతరగతి – ఇంటర్ – డిగ్రీ పరీక్షలు పూర్తయిన వెంటనే కోర్టు తీర్పుతో సంబంధం లేని పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని చెప్తున్నారు. మే నెలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించారు.