టీడీపీ, వైసీపీ పగ్గాలు ఆ ఇద్ద‌రి చేతుల్లోకి..?

ఏపీ రాజ‌కీయాల్లో స‌రికొత్త ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయి. మామ‌గారి కోసం కోడ‌లు, భ‌ర్త కోసం భార్య రంగంలోకి దిగ‌బోతున్నారు. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో వీరిద్ద‌రూ ఢీ అంటే ఢీ కొట్ట‌బోతున్నారు. పార్టీ బాధ్య‌త‌ల‌ను త‌మ భుజ‌స్కందాల‌పై మోయ‌బోతున్నారు. వీరి నేప‌థ్యం ఒక్క‌టే అయినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుప‌డిన సంద‌ర్భాలు కూడా త‌క్కువే! కానీ తొలిసారిగా 2019 ఎన్నిక‌ల్లో వీరు త‌ల‌ప‌డబోతున్నారు. వీరెవ‌రంటే  చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి, వైఎస్ కోడ‌లు భార‌తి. వీరిద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీలక బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌బోతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏపీలో ఎన్నికల వేడి రగులుకుంటోంది. రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుతున్న రెండు కుటుంబాలకు చెందిన మహిళలు 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తలపడ బోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబాల‌ మ‌ధ్య రాజ‌కీయ వైరం.. వ్య‌క్తిగ‌త వైరంగా మారిపోయింది. ఇప్పుడు ఈ పోరులోకి కోడ‌ళ్లు ఎంట‌ర్ అవ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నారా వారి కోడ‌లు బ్రాహ్మ‌ణి, వైఎస్ కోడ‌లు భార‌తి.. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌నే గుస‌గుస‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ఊపందుకున్నాయి.

ఇప్పటికే టీడీపీ సర్వే వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న బ్రాహ్మణి ని వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట. స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్ సభకు ఆమెని పోటీ చేయించాలని సీరియస్ గా ఆలోచిస్తున్నార‌ట‌. అందుకే లోకేష్ కి విజయవాడ బాధ్యతలు అప్పగించార‌ని సమాచారం. బ్రాహ్మణి గెలుపు భారాన్ని లోకేష్ మీద పెడుతున్నట్లు సంకేతాలిచ్చారు. అలాగే బ్రాహ్మణి తో కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు.

ఇక వై.ఎస్ కోడలు, జగన్ సతీమణి భారతి కూడా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయట. జగన్ కి కేసుల వల్ల ఇబ్బంది వచ్చినా, లేకున్నా పార్టీ భారాన్ని మోయడానికి భారతి సిద్ధంగా ఉన్నారట.  పార్టీ పనులన్నీ భారతికి అప్పగించడానికి జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కడప లోక్‌స‌భ నుంచి భారతిని పోటీ చేయించాలని కూడా ఆలోచిస్తున్నారట. జగన్ జైలుకి వెళితే భారతి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి కూడా కదిలే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ కోడ‌ళ్లు ఎలా నెట్టుకువ‌స్తారో వేచిచూడాల్సిందే!!