తమిళనాడు గవర్నర్ ఇప్పుడైనా పనిచేస్తారా?!

త‌మిళ‌నాడులో ఇప్పుడు కొంద‌రు ఊహించిన ప‌రిణామాలే జ‌రిగిపోయాయి. సీఎం పీఠం ఎక్కుతాన‌నుకున్న శ‌శిక‌ళ‌ అక్ర‌మాస్తుల కేసులో జైలుకెళ్లారు. దీంతో ఇక‌, రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు ప‌రిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వానికి అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ పంచ‌న చేరిపోయారు. వారంతా చిన్న‌మ్మ‌కే మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు, వీరి సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను శ‌శిక‌ళ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావుకి కూడా అంద‌జేసింది. అయిన‌ప్ప‌టికీ.. సుప్రీం కోర్టు కేసు చూపుతూ అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ ఆమెను ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించ‌లేదు.

అయితే, సుప్రీ తీర్పు నేప‌థ్యంలో శ‌శిక‌ళ ఇప్పుడు జైలుకు వెళ్లినా.. ఆమె త‌న స్థానంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ళ‌ని స్వామిని కూర్చోబెట్టారు. దీంతో ఆయ‌న త‌న కున్న మ‌ద్ద‌తు ఎమ్మెల్యేల వివ‌రాల‌తో గ‌వ‌ర్న‌ర్‌ను ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌న‌ను ఆహ్వానించాల‌ని ఆయ‌న కోరారు. అయిన‌ప్ప‌టికీ.. విద్యా సాగ‌ర‌రావు నుంచి ఎలాంటి పిలుపూ రాలేదు. పోనీ సంకేతాలు అయినా వ‌చ్చాయా? అంటే అదీ లేదు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ఏం చేస్తున్నారు? ఏం చేయ‌బోతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

నిజానికి త‌మిళ‌నాడు రాజ‌కీయాల విష‌యంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్ కేంద్రంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి మ‌ద్ద‌తు లేని, ఇప్ప‌టికే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన ప‌న్నీర్ సెల్వానికి కేంద్రం స‌హా గ‌వ‌ర్న‌ర్ ఏదో అవ‌కాశం ఇస్తున్నార‌ని, తెర వెనుక ఏదో జ‌రుగుతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ‌నుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మెజారిటీ ఉందని చెబుతున్న ప‌ళ‌ని స్వామిని గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానిస్తారా?  లేక మెజారిటీ నిరూపించుకోవాల‌ని ప‌న్నీర్‌కి అవ‌కాశం క‌ల్పిస్తారా? అనేది వెయ్యి డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. అయితే, ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిస్థితిలో గ‌వ‌ర్న‌ర్ ఇంకా తాత్సారం చేస్తార‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ప‌న్నీర్‌కి ప‌రోక్షంగా ఊతం ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపుతున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఏర్పాటు ఈ వారం ఉండే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.