తానాకి నారా కుటుంబంపై అంత ప్రేమెందుకో?!

అమెరికాలోని తెలుగు ఎన్నారైల‌లో ఓ వ‌ర్గం వారు పెట్టుకున్న తెలుగు అసోసియేష‌న్ తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా). ఈ సంస్థ అమెరికాలోని తెలుగు వారి సంక్షేమంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. దీంతో తానా సంస్థ‌కు ఎంతో పాపులారిటీ ఉంది. ఇక‌, ఈ తానాలో కార్య‌నిర్వాహ‌క స‌భ్యులుగా ఉండాలంటే పెద్ద క‌స‌ర‌త్తే ఉంటుంది. ఏదైనా రంగంలో నిష్ణాతులై.. తెలుగు భాష ప‌ట్ల ఎంతో కొంత సేవ చేసిన వారికి మాత్ర‌మే తానా స‌భ్య‌త్వం క‌ల్పిస్తుంది. అయితే, ఇటీవ‌ల కాలంలో ఈ తానా సంస్థ ప్ర‌తినిధులు కొంద‌రు ఏపీలో అధికారంలో ఉన్న‌వారికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

తానా స‌భ్య‌త్వాల‌ను రాజ‌కీయ ప్రాతిప‌దిక‌న‌, స్వ‌లాభం ప్రాతిప‌దిక‌న క‌ట్ట‌బెడుతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌, ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణిల‌కు తానా స‌భ్య‌త్వం ఇచ్చింది. ఇప్పుడు ఇదే విష‌యం వివాదానికి దారితీసింది. నారా కుటుంబ స‌భ్య‌లకు ఇలా తానా స‌భ్య‌త్వం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటూ.. ల‌క్ష్మీ సింధు అనే మ‌హిళ తానా క‌మిటీకి పెద్ద లేఖ‌రాశారు. తానాలో 10 వేల మందికి స‌భ్య‌త్వం క‌ల్పించేందుకు 40 ఏళ్లు ప‌ట్టింద‌ని, అలాంటిది కేవలం 15 రోజుల్లోనే కొత్త‌గా 5 వేల మందికి స‌భ్య‌త్వం ఎలా ఇచ్చార‌ని ఆమె నిల‌దీశారు.

అంతేకాకుండా.. గిఫ్ట్ కార్డు ఈ మెయిల్ ఐడీతో ఎవరైనా తానా సభ్యులుగా చేరిపోవచ్చా? అని ఆమె ప్రశ్నించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపించాలని ఆమె తన లేఖలో డిమాండ్ చేశారు. ఇలా ఇష్టానుసారంగా సభ్యులు చేరితే ప్రతిష్టాత్మక తానా పరిస్థితి ఏమిటి? రాబోయే రోజుల్లో తానా నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదా? అని కూడా ఆమె ప్రశ్నించారు.  ప్ర‌తిష్టాత్మ‌క తానా పై ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు అమెరికాలోనూ ఎంతో గుర్తింపు ఉంద‌ని ఆమె అన్నారు. ఈ క్ర‌మంలో తానా క‌మిటీ ల‌క్ష్మిలేఖ‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి.