తిరుమల వెంకన్నకు కేసీఆర్ కానుకలు ఇవే…

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోని మొక్కుల‌ను, ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా తీర్చుకుంటూ వ‌స్తున్నారు సీఎం కె,చంద్ర‌శేఖ‌ర్ రావు!! ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో  తెలంగాణ సిద్ధించేందుకు ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడ‌ని ఆయ‌న త‌ర‌చూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటీవ‌లే భ‌ద్రాక‌ళి అమ్మ‌వారికి కిరీటం, ఖ‌డ్గం; అలాగే కురివి మల్లన్నకు మీసాలు కూడా స‌మ‌ర్పించారు.  ఇప్పుడు తిరుమల శ్రీ‌నివాసుడి మొక్కు చెల్లిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు రూ.6కోట్ల విలువైన ఆరణాల‌ను శ్రీ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించ‌బోతున్నారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయాక‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో చాలా సార్లు ప‌ర్య‌టించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. కేవ‌లం రెండుసార్లు ఏపీలో అడుగుపెట్టారు. ఇప్పుడు మ‌రోసారి ఏపీకి రాబోతున్నారు కేసీఆర్‌! ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ వ‌స్తే.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామికి ముడుపులు చెల్లించుకున్న విష‌యం తెలిసిందే! ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకునేందుకు ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగుపెట్ట‌బోతున్నారు!

కుటుంబసభ్యులు, పలువురు మంత్రులతో కలసి ఆయ‌న తిరుమలకు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కానుకలను శ్రీవారికి సమర్పించబోతున్నారు. వాటిలో ప్రధాన కానుకలు ఇవే.రూ. 5.59కోట్ల విలువైన సాలగ్రామహారం, కంఠాభరణం. అదే రోజు తిరుపతిలోని పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను కూడా సమర్పించు కుంటారు. తిరిగి 22వ తేదీ సాయంత్రం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుంటారు.ఈ  నేప‌థ్యంలో గతంలో టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి తిరుమ‌ల చేరుకున్నారు.