తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య కోల్డ్ వార్ తార‌స్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్‌లో చేర కేసీఆర్ మ‌న్న‌న‌లు పొందుతున్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు, కేసీఆర్ వెన్నంటే న‌డుస్తూ ఉన్న జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర‌మ‌యింది. త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గిస్తూ.. తుమ్మ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, త‌న జిల్లా వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున‌నారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మ‌న్ ఎంపిక‌ వ్య‌వ‌హారంలో వీరి మ‌ధ్య విభేదాలు మ‌రోసారి భ‌గ్గుమంటున్నాయి!

మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డికి ఇద్దరిదీ ఒక జిల్లా కాదు. మరి ఇద్దరికీ ఎక్కడి చెడిందంటే… నల్లగొండ డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ విషయంలో ఇద్దరూ పట్టుదలతో ఉన్నారట‌. ఛైర్మన్ అభ్యర్థిత్వం ఆశించే వ్యక్తి… తుమ్మలకు బాగా కావలసిన వాడని ప్రచారం. అయితే ఆ వ్యక్తిపై జగదీశ్ రెడ్డికి మంచి అభిప్రాయం లేదట. ఆయన ఛైర్మన్ కాకుండా జగదీశ్ అడ్డం పడుతున్నారన్నవాదన ఉంది. తుమ్మల మాత్రం తనకు కావలసిన వ్యక్తి కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట. అయితే జగదీశ్ వాదనలో ఎంతో కొంత బలం లేకపోలేదు. ఎందుకంటే ఇది తుమ్మల సొంత జిల్లా కాదు. ఆ ఇలాకా జగదీశ్ రెడ్డి పరిధిలోకి వస్తుండ‌టం విభేదాల‌కు ఆజ్యం పోసింది.

టీఆర్ఎస్ లో తుమ్మల కంటే జగదీశ్ రెడ్డి బాగా సీనియర్. అయినా తుమ్మల నిన్నగాక మొన్న వచ్చి అదీ తన ఇలాకాలో తలదూర్చడం జగదీశ్ రెడ్డికి అస్సలు నచ్చడం లేదట. తనను కాదని ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా జగదీశ్ తట్టుకోలేకపోతున్నారట. అటు తుమ్మల మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని కానిస్తున్నారట. ఈ ఇద్దరి రాజకీయంలో టీఆర్ఎస్ క్యాడర్ నలిగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తుమ్మల, జగదీశ్ రెడ్డి.. ఇద్దరూ సీఎం కేసీఆర్ కు సన్నిహితులే. అయితే వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. వీరిలో జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి కంటే తుమ్మలపై కేసీఆర్ కు కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకే పక్క జిల్లాలో తన ఆధిపత్యం కోసం తుమ్మల ప్రయత్నిస్తున్నా… కేసీఆర్ ఏమీ అనడం లేదట. అంతేకాదు ఈ విషయంలో జగదీశ్ పైనే కేసీఆర్ అక్షింతలు వేశారని టాక్. మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ .. ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో వేచిచూడాల్సిందే!!