తెలంగాణ మంత్రికి ఇంత నిర్ద‌యా..!

మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు.. మ‌చ్చుకైనా లేడు చూడు మాన‌వ‌త్వం ఉన్న‌వాడు- ఇది తెలంగాణ‌కి చెందిన ఓ క‌వి ఆవేద‌న‌! నానాటికీ మ‌నిషిలో మాన‌వ‌త్వం చ‌చ్చిపోతోంద‌ని, పాపం.. అనే మాట‌ను సైతం మ‌రిచిపోయే ప‌రిస్థితికి మ‌నిషి దిగ‌జారి పోతున్నాడ‌ని క‌వి కార్చిన క‌న్నీటి బిందువులు.. ఇలా అక్ష‌రాలై.. వేద‌న‌ను పంచాయి. ఇప్పుడు ఈ అక్ష‌రాల‌ను నిజం అని నిరూపించారు తెలంగాణ‌కే చెందిన మంత్రి ఒక‌రు. త‌న క‌ళ్ల ముందు ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న వారిని సైతం ప‌ల‌క‌రించేందుకు ఆయ‌నకు మ‌న‌సు రాలేదు. మ‌రి ఆ బాధితుల‌ను ప‌రాయి దేశం వార‌నుకున్నారో? లేక.. శ‌త్రుదేశం పౌరుల‌నుకున్నారో? తెలీదుకానీ.. క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయం చేయ‌కుండానే వెళ్లిపోయి.. మాన‌వ‌త్వం లేని మంత్రి అని నిరూపించుకున్నారు. వివ‌రాలు..

తెలంగాణ‌లోని జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో ములుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న పాలంపేట్ గ్రామం న‌ల్ల‌క‌లువ క్రాస్‌రోడ్ వ‌ద్ద ఆదివారం మ‌ధ్యాహ్నం ఓ ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తాడూరి మధుసూదనా చారి తన మిత్రులు గోపి, సతీష్‌తో కలిసి రామయ్య ఆలయం దర్శించుకునేందుకు మోటార్‌బైక్‌తో వెళ్తుండగా వేగంగా వచ్చిన‌ ట్రక్ ఒకటి వీరు ప్ర‌యాణిస్తున్న‌ బైక్‌ను ఢీకొంది. దీంతో 30 ఏళ్ల చారి అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ట్ర‌క్ ఆగ‌కుండా వెళ్లిపోయింది.

విష‌యం తెలుసుకున్న స్థానికులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని బాధితుల‌ను ఆస్ప‌త్రికి చేర్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, అందుబాటులో ఎలాంటి వాహ‌నం వారికి క‌నిపించ‌లేదు. ఇదే స‌మ‌యంలో అదే రోడ్డు మీదుగా తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీర చందూలాల్ కాన్వాయ్ వ‌చ్చింది. దీంతో స్థానికులు కాన్వాయ్ ఆగుతుంద‌ని, బాధితుల‌ను ర‌క్షించుకోవ‌చ్చ‌ని భావించారు. అయితే, మంత్రి మాత్రం ఈ ఘ‌ట‌న‌ను చూసి కూడా కాన్వాయ్‌ను ఆప‌కుండా వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డి వారు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. యువ‌కులకు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతం మంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఉంది.

అయినా కూడా మంత్రి ఏం జ‌రిగిందో కూడా తెలుసుకోకుండా, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌కుండా త‌న మానాన తాను వెళ్లిపోవ‌డం ఆగ్ర‌హం తెప్పించింది. ఈ ఘ‌ట‌న మొత్తాన్ని త‌న ఫోన్‌లో చిత్రీక‌రించిన స్థానికుడు ఒక‌రు వాట్ప‌స్‌లో పోస్ట్ చేయ‌డంతో విష‌యం కొంత ఆల‌స్యంగా వెలుగు చూసింది. అయితే, దీనిపై మంత్రి స్పందిస్తూ.. త‌న వారు ఒక‌రు ప్రాణాపాయ స్థితిలో ఉన్నార‌ని ఫోన్ వ‌స్తే వెళ్లాన‌ని.. తాను అంతా చూశాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.