తెలుగు మీడియా లో మరో సంచలనం

టీవీ9 సంచ‌నాల‌కు మారుపేరు! అటువంటి సంస్థ‌ను అంత‌లా న‌డిపించాలంటే అలా సంచ‌ల‌నాలు తీసుకునే అధినేత ఉండాలి. టీవీ9కు అంత‌టి బ్రాండ్ తీసుకొచ్చిన వ్య‌క్తి ర‌విప్ర‌కాష్‌! సంచల‌నాల‌కు వేదికైన టీవీ9.. గురించి మ‌రో సంచ‌ల‌న విష‌యం!! టీవీ9ను బాగా పాపుల‌ర్ చేసిన ర‌విప్ర‌కాష్‌.. ఇప్పుడు ఆ సంస్థ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోబోతున్నారు. అంతేగాక ఆ సంస్థ‌ను మ‌రో మీడియా సంస్థకు అప్ప‌గించ‌బోతున్నారు. ఇక జ‌ర్న‌లిజం నుంచి దూర‌మైపోతున్నా.. ఎంట‌ర్‌టైన్ మెంట్ చాన‌ల్ ను ప్రారంభించ‌బోతున్నాడ‌ట.

టీవీ9 యాజమాన్యం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చేతులు మారనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. టీవీ9ను ఎన్టీవీ యాజ‌మాన్యానికి అప్ప‌గించేందుకు ర‌విప్ర‌కాష్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఎప్పటి నుంచో టీవీ9ను విక్రయిం చేందుకు దీని ప్రమోటర్ శ్రీనిరాజు ప్రయత్నాలు చేస్తున్నా..ఇటీవల కాలం వరకూ అవి ముందుకు సాగలేదు. అయితే కొద్ది కాలం క్రితమే ఈ డీల్ క్లిక్ అయినట్లు సమాచారం. అయితే టీవీ9ను వ‌దిలేసి త్వ‌ర‌లో ఒక ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ పని ప్రారంభం అయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొంత కాలంగా టీవీ9 రవిఫ్రకాష్ హైదరాబాద్ లో ఎన్టీవీ కార్యాలయం ఉన్న భవనంలో కొంత సమయం గడుపుతూ కొత్త ఛానల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు అక్కడ ప్రత్యేకంగా ఓ ఛాంబర్ ను కూడా కేటాయించారు. దీంతో త్వరలోనే టీవీ9 నుంచి బయటికి రాబోతున్నారని ఎన్టీవీ వ‌ర్గాలు తెలిపాయి. ఎన్టీవీ, రవిప్రకాష్, మరికొంత మంది ప్రమోటర్లు కలసి నెలకొల్పే ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ఓ గాడిన పడ్డ తర్వాత ఆయన ఎన్టీవీని నెంబర్ వన్ స్థానంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తారట‌.

రవిప్రకాష్ గతంలో తేజ ఛానల్ ..అంతకు ముందు సిటీ కేబుల్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితం. అయితే ఆయన బాగా పాపులర్ అయింది మాత్రం టీవీ9 ద్వారానే. 2002లో టీవీ9 ప్రారంభం నుంచే ఆయన కీలక భూమిక పోషిస్తున్న విష‌యం తెలిసిందే! అయితే ఆయ‌న ఎందుకు టీవీ9 నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకుంటున్నార‌నేది ప్ర‌స్తుతం అంద‌రిలోనూ ఉన్న ప్ర‌శ్న‌!!