నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖ‌రారు..!

ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌కు ర‌స‌వ‌త్త‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. 2014లో సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిల‌ప్రియ ఏక‌గ్రీవంగా గెల‌వ‌గా, కృష్ణా జిల్లా నందిగామ‌లో మృతిచెందిన తంగిరాల ప్ర‌భాక‌ర్‌రావు కుమార్తె సౌమ్య విజ‌యం సాధించారు. ఇక తిరుప‌తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంక‌ట‌ర‌మ‌ణ మృతి చెందగా అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న భార్య సుగుణ‌మ్మ ల‌క్ష ఓట్ల భారీ తేడాతో గెలిచారు.

ఇక ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు వారసుడి ఎంపిక మొదలైంది. భూమా ఫ్యామిలీకే ఈ టిక్కెట్టును చంద్ర‌బాబు కేటాయించ‌నున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల‌ప్రియ ఇప్ప‌టికే ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు.

భూమా మ‌రో కుమార్తెతో పాటు కుమారుడు చాలా చిన్న వారు. దీంతో అదే కుటుంబానికి చెందిన మ‌రో వార‌సుడు పేరు ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. అత‌డే నాగిరెడ్డి సోద‌రుడు శేఖ‌ర్‌రెడ్డి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి. బ్ర‌హ్మానంద‌రెడ్డి తండ్రి శేఖ‌ర్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న టైంలో 1992లో హ‌ఠాన్మ‌ర‌ణానికి గుర‌య్యారు. అప్పుడు భూమా నాగిరెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు.

గ‌తంలో శోభా నాగిరెడ్డి మృతి చెందిన‌ప్పుడే బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి క‌న‌ప‌రిచారు. అయితే అప్పుడు అఖిల‌ప్రియ‌కు ఛాన్స్ ఇవ్వ‌డంతో బ్ర‌హ్మానంద‌రెడ్డి కోరిక తీర‌లేదు. ఇక ఇప్పుడు చిన్నాన్న మృతితో ఖాళీ అయిన సీటును బ్రహ్మానంద రెడ్డి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం బ్ర‌హ్మానంద‌రెడ్డి భూమా ఫ్యామిలీకి చెందిన జ‌గ‌న్ డెయిరీ వ్య‌వ‌హారాలు చూస్తున్నాడు.

ఈయ‌న వైసీపీ నేత బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అల్లుడు. దీంతో ఆయన బరిలో దిగితే కాటసాని కూడా టీడీపీలోకి వచ్చేయ‌డం ఖాయం. ఇక చంద్ర‌బాబు కూడా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు మీదే ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌.