నరుడా డొనరుడా TJ రివ్యూ

సినిమా : నరుడా డోనరుడా
రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : మొలకెత్తని విత్తనం

తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ
సంగీతం : శ్రీ చరణ్
నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట
దర్శకత్వం : మల్లిక్ రామ్
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
మాటలు : సాగర్ రాచకొండ,కిట్టు

రీమేక్ సినిమాలు తీయడం శానా వీజీనే కానీ వాళ్ళ వాళ్ళ నేటివిటికీ తగ్గట్టుగా మార్పులు ..చేర్పులు చేయకపోతే చేతులు కాల్చుకున్న రీమేక్ సినిమాలు ఎన్నో చూసాం.విక్కీ డోనర్ అనే విచిత్రమైన కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో అందరి తో శభాష్ అనిపించుకుందా సినిమా.అసలా కాన్సెప్ట్ కి మన నేటివిటీకి చాలా దూరం..అలాంటి కాన్సెప్ట్ ని మక్కికి మక్కి దించేసి నరుడా దొనరుడా అంటూ ఓ వింత విత్తనం నాటి విఫల యత్నం చేసినా అది మొలకెత్తే పరిస్థితి కనబడలేదు.

హీరో తల్లి,నానమ్మ కలిసి సరదాగా ఇంట్లో కూర్చొని మందుతాగుతూ ఉంటే చూసి ఆనందించేంత లెవెల్ కి ఇంకా తెలుగు ప్రేక్షకులు ఎదగలేదు.అందులోను హీరో తండ్రి కార్గిల్ వార్ లో ప్రాణాలర్పించిన దేశ సైనికుడు.అలాంటి కుటుంబంలో ఉండాల్సిన వాతావరణమే మనకు కనిపించదు.దీంతో హీరో ఫ్యామిలీతో వుండే బాండింగ్ మొత్తం చాలా ఆర్టిఫిషల్ గా తయారైంది.ఇదొక్కటే కాదు అనేక సన్నివేశాలు చూస్తే ఎదో డబ్బింగ్ సినిమా చుస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఇది స్ట్రెయిట్ సినిమా అనే ఫీలింగ్ మాత్రం కలగదు.

ఒరిజినల్ సినిమాలో వుండే హ్యూమర్,ఎమోషన్,కామెడీ ఆ ఫ్రెష్ నెస్ ఈ సినిమాలో ఏ మాత్రం కనిపించవు.అక్కడక్కడా కొన్ని పంచ్ లు పేలినా అవి సినిమాను కాపాడే అంత కెపాసిటీ లేదు.స్పెర్మ్ అన్న పదం పబ్లిక్ గా పలకడానికి మొహమాట పడే కల్చర్ లో వున్నాం మనం.అలాంటిది స్పెర్మ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ మీద ఏకంగా సినిమా అంటే ఎంతో జాగ్రత్తగా హేండిల్ చెయ్యాలి.లేకపోతే అది రీమేక్ సినిమా అయినా దుబ్బింగ్ సినిమా అయినా బొక్క బోర్లానే.

డబ్బుల కోసం స్పెర్మ్ డోనర్ గా మారిన హీరో తరువాత ప్రేమ పెళ్లి,కుటుంబం వంటి అంశాల్లో ఈ డొనేషన్ దొనరుడికి ఎన్ని కష్టాలు తెచ్చింది అనేదే ఈ సినిమా కథాంశం.కలగా పులగం గా అన్ని అద్దెకు తెచ్చుకున్న సీన్స్ తో అతలాకుతలమైన ప్రేక్షకుడికి ప్రి క్లైమాక్స్ , క్లైమాక్స్ కొంచెం రిలీఫ్ నిస్తాయి.

సుమంత్ సినీ కెరీర్ గురించి సీరియస్ గా ఆలోచించాలి.సీరియస్ గా సినిమాలే కెరీర్ అనుకుంటే మాత్రం ఇప్పుడేళ్లే దారి కరెక్ట్ కాదు.లేదు ఎదో టైంపాస్ కి అనుకున్న కూడా వరుస ప్లాప్ లు వస్తే సొంత బ్యానర్ లో కూడా సినిమాలు చేయడానికి ఆలోచిస్తారు.బయటివాళ్లకంటే ఏ బ్యాచ్ వారసులకు ఆ బ్యాచ్ లోనే విపరీతమైన పోటీ ఉన్న రోజులివి.కాబట్టి సుమంత్ కెరీర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే కష్టం.

సుమంత్ నటనలో ఒక నిజాయితీ ఉంటుంది.. అంతకు మించి ఈజ్ ఉంటుంది..అవి కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి.తనికెళ్ళ భరణి తన మార్క్ నటనతో మరో సారి మెప్పించాడు.హీరోయిన్ పల్లవి సుభాష్ పర్లేదనిపిస్తుంది. మిగిలిన వాళ్లంతా ఎవరి పరిధిలో వాళ్ళు నటించారు.నాగ చైతన్య ఓ రెండు క్షణాలు మెరుపులా మెరిశాడు.పాటలు ఉన్నాయో లేవో అనేటట్టున్నాయి.నేపధ్య సంగీతం కూడా అంతే. సినిమాటోగ్రఫీ పర్లేదు.మాటలు అక్కడక్కడా పేలాయి అంతే.

మొత్తంగా ఈ నరుడా దొనరుడా స్ట్రెయిట్ సినిమాకి తక్కువ దుబ్బింగ్ సినిమాకి ఎక్కువ అనేంతగా ఎన్ని ఎరువులేసినా ఓ మొలకెత్తని విత్తనంగా మిగిలిపోయింది.