నరేంద్రమోడీకి మళ్ళీ వాచిపోయింది

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌కి మళ్ళీ వాచిపోయింది. ఫిరాయింపు రాజకీయాలతో ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాజకీయ పెత్తనం చెలాయించాలని చూసిన నరేంద్రమోడీకి దిమ్మతిరిగే షాక్‌లు తగులుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నించి, భంగపాటు ఎదుర్కొంది నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవలే. అది చాలదన్నట్లు అరుణాచల్‌ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ నరేంద్రమోడీ సర్కార్‌కి మొట్టికాయ పడింది. 2015 డిసెంబర్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్‌ అప్పటివరకూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించేలా చేసి, కాంగ్రెస్‌ని దెబ్బకొట్టింది బిజెపి.

గవర్నర్‌ అత్యుత్సాహం ప్రదర్శించగా, అక్కడ ప్రభుత్వం దెబ్బతింది. అయితే గవర్నర్‌ అత్యుత్సాహాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఊరట పొందింది. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్‌ వెనుక కథ నడిపించింది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారే కావడంతో సుప్రీంకోర్టు పెట్టిన చీవాట్లు పూర్తిగా బీజేపీ ఖాతాలోనికే వెళతాయి. సుప్రీంకోర్టు దేశాన్ని రక్షిస్తోదంటూ ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి నబం తుకీ చెప్పారు. సుప్రీం తాజా తీర్పుతో నబం తుకీ తిరిగి ముఖ్యమంత్రి అవనున్నారు. ఈ ఘటనపై స్పందించడానికి బిజెపి నాయకులకు మొహం చెల్లడంలేదు.