నాకు వ్యక్తులుకన్నా పార్టీ ముఖ్యం .. మంత్రిపై బాబు ఫైర్

విశాఖ‌లో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడికి పార్టీ అధినేత చంద్ర‌బాబు గ‌ట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీ‌నివాస‌రావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భ‌రించ‌లేను` అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీ నేత‌ల‌తో స‌ఖ్య‌తగా ఉండ‌క‌పోతే.. ఇక చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. పార్టీకి న‌ష్టం కలిగేలా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించ‌బోన‌ని స్ప‌ష్టంచేశారు.

కొంత‌కాలం నుంచీ విశాఖ‌లో గంటా వ‌ర్సెస్ అయ్య‌న్న వార్ జ‌రుగుతోంది. అధినేత చంద్ర‌బాబు ఎన్ని సార్లు వీరిద్ద‌రినీ పిలిచి మంద‌లించినా.. ఎవ‌రూ వెన‌క‌డుగు వేయ‌డం లేదు. వీరి మ‌ధ్య గ‌ల వ‌ర్గ విభేదాలు విశాఖ ఉత్స‌వ్‌లో మ‌రోసారి బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం.. దండ‌గ అంటూ అయ్య‌న్న విమ‌ర్శించ‌డం క‌ల‌క‌లం రేపింది. విశాఖ ఉత్స‌వ్ ఏర్పాట్లు గంటాకే అప్ప‌గించ‌డం.. అయ‌నే అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డంపై అయ్య‌న్న తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ అంశాన్ని చంద్రబాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇక‌నైనా విభేదాల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌యత్నించారు.

ఉండవల్లిలో తన నివాసంలో పార్టీ విశాఖ జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‘మిమ్మల్ని భరించలేను.. ఇకనైనా మారండి’ అంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రి గంటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. విభేదాల వల్ల పార్టీకి జిల్లాలో నష్టం కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చాలా సార్లు అన్ని రకాలు నచ్చచెప్పినా పరిస్థితిలో మార్పులేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన నేతలే ఇలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కల్గించే రీతిలో వ్యవహరించే వారిని భరించడం ఇక సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు సమాచారం. తనకు పార్టీ చాలా ముఖ్యమని పార్టీకి ఇబ్బంది కల్గించేవారిపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని సుతిమెత్తగా హెచ్చరించారు. మ‌రి ఇప్ప‌టికైనా విశాఖ‌లో విభేదాలు వీడ‌తారో లేదో!!