నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్‌ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్‌ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు మండిపోతుంది, నాలిక చీరేస్తారట.

ఛ ఊర్కోండి, రాజకీయాల్లో ఉన్నాక ఎలాగైనా అనుకోవచ్చునుగాక. తెలంగాణలోనూ, రాయలసీమలోనూ, ఇంకొన్ని తెలుగు జిల్లాల్లోనూ ఎంత పెద్దోళ్ళకయినా ‘ఏకవచనం’తో సంబోదించడం మామూలే. రాజకీయాల్లో అయితే దారుణంగా తిట్టుకుంటారు. కెసియార్‌ని మాత్రం ‘ఏకవచనం’తో సంబోదించకూడదని హుకూం జారీ చేసేశారు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు. ‘మా కేసీఆర్‌ చేస్తుండు’ అని తెలంగాణలోనే ఎక్కువగా ఏకవచనంతో సంబోదిస్తారు కదా. వాళ్ళందరి నాలికల్నీ తెగ్గోసేస్తానంటే ఎట్లయితది సారూ! స్వామి భక్తి ఉండాలిగానీ, మరీ ఇంత ఎక్కువగానా? పైగా మంత్రిగారాయె. కాస్తంత సంయమనం పాటించండి.