పన్నీర్ యాక్షన్.. శశికళ లెక్కలు తారుమారు!

త‌మిళ‌నాడులో సీఎం సీటు కోసం జ‌రుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు రోజుల కింద‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా అంతా జ‌రిగిపోతుంద‌ని అనుకున్న పరిస్థితిలో ప‌న్నీర్ పేల్చిన బాంబు రాష్ట్ర అధికారం ప‌క్షంలో మ‌రో వ‌ర్దా తుఫానును సృష్టించింది. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలున్న  అధికార అన్నాడీఎంకేలో అధికారం చేప‌ట్టాల‌నుకునే వారు క‌నీసం 117 మంది ఎమ్మెల్యేల మెజారిటీని పొంది ఉండాలి. ఈ నేప‌థ్యంలో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తాను గీసిన గీత దాట‌ర‌ని చెప్పిన శ‌శిక‌ళ‌.. సీఎం ప‌ద‌విని చేప‌ట్టేందుకు త‌న‌కే అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయ‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే ప‌న్నీర్‌తో ఆమె రాజీనామా చేయించారు. అయితే, అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించి, తిరుగు బాటు బావుటా ఎగ‌రేసిన ప‌న్నీర్‌.. అమ్మ.. ఆత్మ అంటూ.. శ‌శిక‌ళ‌కు చెక్ పెట్టేందుకు గ‌ట్టిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గురువారం ఉద‌యం వ‌ర‌కు ప‌న్నీర్ ప‌క్షాన కేవ‌లం ఒక‌టి, రెండుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు దాదాపు 50 మందికి చేరింది. ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా శ‌శిక‌ళ‌కు మింగుడు ప‌డ‌క‌పోగా.. ఆమెను పూర్తిగా డీలా ప‌డేలా చేసింది. ఈప‌రిణామంతో ఆమె శిబిరం బ‌లం 80 -90కి ప‌డిపోయింది. గురువారం సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావు .. త‌మిళ‌నాడు సీఎం సీటుపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న నేప‌థ్యంలో ఇలా ఒక్క‌సారిగా శ‌శిక‌ళ కూట‌మిగా ఉన్న స‌భ్యులు ప‌న్నీర్‌కి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాయి.

ఇప్ప‌టిక‌ప్పుడు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. అన్నాడీఎంకేలో కీల‌క నేత‌గా ఉన్న మ‌ధుసూద‌న్‌.. ముఖ్యమంత్రి ప‌న్నీర్ సెల్వం చెంత‌కు చేరిపోయారు. ఇది .. ప‌న్నీర్‌కి క‌లిసొచ్చే అంశంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. మ‌ధుసూద‌న్ వ‌ర్గం దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో వారు కూడా ప‌న్నీర్‌కే మ‌ద్ద‌తు చెబుతార‌ని స‌మాచారం. నిజానికి శ‌శిక‌ళ‌.. ఎమ్మెల్యేల‌ను బ‌ల‌వంతంగా బ‌స్సుల్లో కుక్కి.. వేరే వేరే ప్రాంతాల్లో రిసార్ట్స్‌లో వారిని ఉంచార‌నే వార్త‌లు వెల్లువెత్తున్నాయి. అయితే, వీరికి విముక్తి క‌లిగించి సీఎం విష‌యంలో వారికి స్వేచ్ఛ‌ను క‌లిగించాల‌ని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఇలా.. ప‌న్నీర్ దూకుడు ముందు చిన్న‌మ్మ చిత్తు కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు! మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.