పవన్ పంథా మారదా… జనసేన కార్యకర్తల మాట?

ప్ర‌శ్నిస్తాను అనే ఏకైక నినాదంతో 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అన్ని వ‌ర్గాల్లోనూ ఎన్నో ఆశ‌లు రేకెత్తాయి. ప్ర‌శ్నించ‌డం అంటే.. నేరుగా ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అంటాడ‌ని, స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌నుగొంటాడ‌ని, ప్ర‌జ‌ల ప‌క్షాన ఉద్య‌మాలు నిర్మిస్తాడ‌ని అనుకున్నారు. అయితే, త‌న ప్ర‌శ్న‌లు, పోరాటాలు కేవ‌లం పిట్ట కూత‌ల‌కే ప‌రిమితం చేస్తాడ‌ని అనుకున్నారా?! అయితే, అది త‌న త‌ప్పు కాద‌ని అంటున్నాడు ప‌వ‌న్‌!! అంతేకాదు, అస‌లీమాత్రం స్పందిస్తున్న వాళ్లెవ‌రైనా ఉన్నారా? అని తిక్క‌తిన్న‌గా కుదిరించే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నాడు.

విష‌యంలోకి వెళ్లిపోతే.. ప్ర‌త్యేక హోదా విష‌యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌. తొలుత దీనిని పెంచి పోషించింది ఆ ఇద్ద‌రు నాయుళ్లే!!(చంద్ర‌బాబు, వెంక‌య్య‌) అయితే, ప్ర‌ధాని మోదీ దెబ్బ‌కి.. ఇప్పుడు ఆ హోదా కొమ్మ నుంచి చ‌టుక్కున జారిపోయింది కూడా ఈ నాయుళ్లే!! ఇప్పుడు ఇదే అంశం ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో చ‌లి కాచుకునేందుకు య‌త్నిస్తున్న జ‌గ‌న్ అండ్ కోని బాబు త‌న‌దైన శైలిలో నిలువ‌రిస్తున్నార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే త‌మ ప‌రిధిలో లేక‌పోయినా .. విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ పోలీసులు సృష్టించిన గంద‌ర‌గోళం.

మ‌రి ఇన్ని జ‌రుగుతున్న‌ప్పుడు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ, బీజేపీల‌కి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప‌వ‌న్ ఎంతో షార్ప్‌గా రియాక్ట్ అవుతాడ‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ మాత్రం త‌న స్పంద‌న‌ను సోష‌ల్ మీడియాకే ప‌రిమితం చేసి.. త‌న యాక్ష‌న్‌ని కెమెరాల‌ముందు చూపిస్తున్నాడు. దీంతో అస‌లు ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి?  ఏదో ప్ర‌శ్నిస్తాన‌ని రాజ‌కీయంగా అరంగేట్రం చేసిన ప‌వ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడేంటి? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వ‌స్తోంది.

దీనికితోడు వెంక‌య్య‌ను విమ‌ర్శిస్తున్న ప‌వ‌న్‌పై ఆ పార్టీ నేత‌లు అదే స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ప‌వ‌న్ పిట్ట పిలుపులు, అరుపుల‌కే ప‌రిమితం అని విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలో తానేంటో నిరూపించుకునేందుకు ముందుకు రావాల్సిన ప‌వ‌న్‌.. ఇప్పుడు కూడా త‌న పంథా పిట్ట కూత‌ల‌కే ప‌రిమితం చేస్తుండ‌డం అంద‌రినీ విస్మ‌య ప‌రుస్తోంది. నిజానికి హోదాపై స్పందించాల‌ని అనుకున్న‌ప్పుడు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్రాన్ని నిల‌దీసేలా ఏపీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌డం లేదా.. హోదాపై ఉద్య‌మిస్తున్న ఎంపీల‌తో మాట్లాడి.. ఉద్య‌మాన్ని ఉధృతం చేయ‌డం అనేవి ల‌క్ష్యాలుగా ఉండాలి.

కానీ, ప‌వ‌న్ మాత్రం సూత్రంలేని గాలి ప‌టంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రో రెండు ఏళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ లోప‌ల హోదాపై గ‌ట్టిగా నిల‌బ‌డ‌క‌పోతే.. ప‌రిస్తితి ఏంటి? అనేది నిజానికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తున్న మాట‌. అదేస‌మ‌యంలో పార్టీని సంస్థాగ‌తంగా నిర్మాణం చేయ‌డంలోనూ ప‌వ‌న్ ఇంకా ఏమీ ముంద‌డుగు వేయ‌క‌పోవ‌డంపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా కూడా ప‌వ‌న్ వీటిని ఖాత‌రు చేయ‌న‌ని క‌రాఖండీగా చెబుతుండ‌డం ఆయ‌నకు తిక్కుంది అనే మాట‌ల‌ను నిజమా ? అన్న డౌట్లు ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.