పవన్ వెనుక ” ఈనాడు ” సైన్యం ఉందా?!

ఏ రాజ‌కీయ నేత ఎదుగుద‌ల వెన‌కాలైనా ఎవ‌రో ఒక మేధావి ఉంటాడంటారు! ఇటీవ‌ల కాలంలో ట్వీట్ల‌తో రెచ్చిపోతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెన‌కాల కూడా కొంద‌రు మేధావులు ఉన్నార‌నే టాక్ వ‌స్తోంది. నిజానికి 1984లో ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించిన‌ప్పుడు కూడా కొంత మంది ఆయ‌న వెన‌కాల ఉండి చ‌క్రం తిప్పారు. వీరిలో ముఖ్య‌మైన వ్య‌క్తి ఈనాడు అధినేత రామోజీరావు. పార్టీ ఎదుగుద‌ల‌, అధికారంలోకి వ‌చ్చే దాకా ఎన్‌టీఆర్‌కి దిశానిర్దేశం చేయ‌డంలో రామోజీ పాత్ర ఇప్ప‌టికీ ఓ రికార్డే!

అలాగే.. ఇప్పుడు ప‌వ‌న్ వెనుక కూడా కొంద‌రు మేధావులు ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఒకింత వేడిగానే ఉంటున్నాయి. ఉత్త‌రాది వాళ్లు.. ద‌క్షిణాది వాళ్లు అంటూ ప్రాంతీయ భావంతో చేస్తున్న కామెంట్లు నిజానికి అప్పటి ఎన్‌టీఆర్ హ‌యాంని క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. అప్ప‌ట్లోనూ ఉత్త‌రాది అహంకారం అంటూ అన్న‌గారు అనేక సంద‌ర్భాల్లో విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, తెలుగు వాళ్ల ఆత్మ‌గౌర‌వం అంటూ ప్ర‌క‌టించారు కూడా.. ఇప్పుడూ సేమ్ టు సేమ్ అన్న‌ట్గుగా ప‌వ‌న్ ఉత్తారాది.. అంటూ చేస్తున్న కామెంట్లు.. ఆలోచ‌న రేకెత్తిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ వెన‌క ఎవ‌రున్నార‌నే విష‌యం ఆరాతీస్తే.. ఈనాడు రామోజీ స్కూల్ కి చెందిన కొంద‌రు మేధావులు ప‌వ‌న్ చెంత‌న చేరి స్క్రిప్టు ర‌చిస్తున్నార‌ట‌. ముఖ్యంగా ఉత్త‌రాది, స‌హించం, అనే కొన్ని ఘాటైన ప‌దాలు వీరి డిక్ష‌న‌రీలోంచే వ‌స్తున్నాయ‌ని, వాటినే ప‌వ‌న్ త‌న ట్వీట్ల‌లో పేర్కొంటున్నార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప‌వ‌న్ వెన‌కాల ఈనాడు ఉందేమోన‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ వెనుక ఎవ‌రున్నా.. ఇంత ఘాటు ప‌దాల‌తో ఏకేయ‌డం సాధ్యం కాద‌ని కూడా తెలుస్తోంది. ఎంతైనా.. ప‌వ‌న్ ఈనాడు డైరెక్ష‌న్‌లో ముందుకు వెళ్తున్నాడ‌న్న‌మాట‌!!