పెటాకుల దిశగా టీడీపీ-బీజేపీ పొత్తు

మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీతో ఎప్పుడెప్పుడు విడిపోదామా? అని బీజేపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు! క‌ల‌హాల కాపురం చేయ‌లేమ‌ని చెబుతున్నా.. త‌ప్ప‌దు అన్న రీతిలో అధినాయక‌త్వం ఆదేశాలివ్వ‌డంతో ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కూట‌మిలో కొన‌సాగుతున్నారు! అయితే పెండింగ్‌లో ఉన్న‌ మున్సిప‌ల్‌-కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీచేయ‌నున్నాయా? ఇక టీడీపీ-బీజేపీ నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకోబోతున్నారా? క‌ల‌హాల కాపురానికి ఈ ఎన్నిక‌ల‌తో ఫుల్ స్టాప్ పెట్టి బ‌రిలోకి దిగ‌బోతున్నారా? అంటే అవున‌నే సమాధాన‌మే వినిపిస్తోంది!

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ – కార్పొరేషన్ ఎన్నికలలో అధికార టీడీపీ ఎలా ప‌య‌నించ‌బోతోంద‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఏపీలోని కొన్ని జిల్లాలో అధికార టీడీపీ – బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో మున్సిపల్ -కార్పొరేషన్ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఒక వేళ టీడీపీని కాదని బీజేపీ ఒంటరిగా వెళితే కార్పొరేషన్ల‌లో మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభావం చూపే పరిస్థితులు లేవనేది అంచ‌నా! ఇదే జరిగితే మాత్రం ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలు.. పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని రాజకీయ వర్గాల అంచనా.

గత సార్వత్రిక ఎన్నికల్లో,  రాజ్యసభ – ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ టీడీపీ-బీజేపీ ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ప్రదర్శించాయి. అయితే ఇటీవల ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకే బీజేపీ – టీడీపీ నేతలు మొగ్గుచూపినా ఈ వ్యవహారంతో ఈ రెండు పార్టీల మధ్య కొంత దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ఇరు పార్టీలు రెండు ధృవీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే కార్పొరేషన్ – మున్సిపల్ ఎన్నికలు టీడీపీ – బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మార‌నున్నాయి!

ఈ ఎన్నికలు అధికార పార్టీకి స‌వాలుగా మారాయి! ఇందులో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు పాల్గొనడంతో  సహజంగానే ప్రభుత్వ పాలన ప్రభావం ఇందులో ప్ర‌భావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఈ కార్పొరేషన్ – మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వాల ఒత్తిడితో ఇరు పార్టీలు కలసి ఎన్నికలకు వెళ్లినా ఓట్ల బదిలీ విషయంలో ఎలా వ్య‌వ‌హారిస్తార‌నే దానిపై రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఒంటరిగా పోటీ చేస్తామ‌ని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప‌రిస్థితుల ఎలా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు!!