పేస్ బుక్ లో పోస్టు పెడితే కేసే అంటోన్న మేయ‌ర్‌

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల‌లో సెల్లార్ల‌తోపాటు ఫ‌స్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చే దారి కూడా లేక జ‌నం అల్లాడారు.రోడ్ల‌న్నీ చెరువులు, కాలువ‌ల‌ను త‌ల‌పించ‌డంతో ర‌వాణా కూడా స్తంభించింది.

ఈ ప‌రిస్థితుల్లో తురక చెరువుల‌కు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జీహ‌చ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు చేసినందునే వర్షాలకు సెల్లార్లు కుంగుతున్నాయని, వర్షం తగ్గకపోతే పిల్లర్లు కూడా కూలే ప్రమాదం ఉందని ఆయ‌న హెచ్చ‌రించారు.

కాగా ఈ ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శిస్తూ, సామాజిక మధ్యమాల్లో ప్ర‌స్తుతం విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై మండిప‌డ్డ మేయ‌ర్ అసత్య ప్రచారాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చ‌రించారు. హుస్సేన్‌సాగర్‌కు ప్రమాదం ఉందని, కాప్రా చెరువు తెగుతుందని సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు.

నిజానికి ఈ ప‌రిస్థితిపై తెలంగాణ స‌ర్కారును నిందించ‌డం కూడా స‌బ‌బు కాదు. హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌తంలో ప‌లు ప్రాంతాల్లో లెక్క‌కుమించిన స్థాయిలో చెరువులుండేవి.. ప‌రిస‌ర ప్రాంతాల్లో కురిసిన వ‌ర్ష‌పు నీరంతా ఆ చెరువుల్లోకి చేరేది… ప్ర‌స్తుతం ఆ చెరువుల్లో చాలావ‌ర‌కు మాయ‌మైపోయాయి… లేదా చిక్కిపోయాయి. అంతులేని ఆక్ర‌మ‌ణ‌ల కార‌ణంగా నీరు వెళ్లేదారులు మూసుకుపోవ‌డ‌మే ఈ ముంపు ప‌రిస్థితికి కార‌ణం. అందులోనూ అసాధార‌ణ స్థాయిలో వ‌ర్ష‌పాతం సంభ‌విస్తే ఇలాంటి విప‌త్తులు త‌ప్ప‌వు. ఇక‌ముందైనా జీహెచ్ఎంసీ దీనికి స‌మ‌గ్ర‌మైన ప‌రిష్కారం క‌నుగొన‌క‌పోతే విశ్వ‌న‌గ‌రం ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారే ప్ర‌మాదం పొంచి ఉంది.