ప్యాకేజీతో రాజకీయ సమాధి.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రచారాన్ని చేస్తూ, ప్యాకేజీ కాకుండా ప్రత్యేక సహాయంతో సరిపెట్టాలనుకున్న బిజెపికి, దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీకీ ఆంధ్రప్రదేశ్‌లో నూకలు చెల్లే రోజులు ముందు ముందు ఉన్నాయి. ప్యాకేజీ లేదా సాయం పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయని ప్రజలు పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీ, ప్రజల ఆలోచనల్ని బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతోంది. ప్యాకేజీ పేరు చెప్పకపోయినా, సాయం పేరుతో విదుల్చుతామని కేంద్రం చెప్పినా స్వాగతించక తప్పని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. బిజెపికి ఎటూ ఆంధ్రప్రదేశ్‌ మీద మమకారం లేదు.

కాని బిజెపితో కలిసి ముందడుగు వేయక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు కూడా తన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టేసుకుంటున్నట్లవుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కలిసి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చే మామూలు నిధులనే ప్రత్యేక సహాయంలో చూపించబోతోందనే విషయం తేటతెల్లమయిపోతుంది. దానికి చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్యాకేజీ అనే పేరు పెట్టి ప్రచారం చేసినా, ఆ ప్రత్యేకత ఏమీ ప్రజలకు కనిపించడంలేదు. దాంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌లానే ఈ రెండు పార్టీలకూ గుణపాఠం చెప్పక తప్పదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తున్నది.