ప్రత్యేక హోదా ఫైట్ లో జగన్ రోల్ ఏంటి ?

ఇప్పుడు అంద‌రూ ఇదే ప్ర‌శ్నించుకుంటున్నారు! నిజానికి ఏపీకి పెద్ద ప్ర‌తిప‌క్షంగా అవ‌త‌రించిన వైకాపా అధినేత జ‌గ‌న్.. రాస్ట్రానికి చెందిన అతి పెద్ద స‌మ‌స్య ప్ర‌త్యేక హోదాపై ఎలాంటి రోల్ పోషిస్తారోన‌ని అంద‌రూ ఎదురు చూశారు. కానీ, ఆయ‌న పెద్దగా స్పందించిందే లేదు. ఏదో నాలుగు మాట‌లు చంద్ర‌బాబును తిట్టేసి.. మైకు ప‌క్క‌న పెట్టేయ‌డం త‌ప్ప జ‌గ‌న్ చేసింది ఏమీలేదు. ఇక‌, శీతాకాల స‌మావేశాల్లో అసెంబ్లీలో హంగామా సృష్టించినా ఫ‌లితం లేని ప‌రీక్ష‌లా మారింద‌నే కామెంట్లు వినిపించాయి. దీనికి తోడు వైకాపా ఎమ్మెల్యేలు ఇరుకున ప‌డ్డారు.

ఇక‌, ఆ త‌ర్వాత యువ భేరి పేరుతో.. ప్ర‌త్యేక హోదాపై యువ‌త‌ను పెద్ద ఎత్తున క‌దిలిస్తాన‌ని చెప్పి క‌ళాశాల్ల‌ల్లో మీటింగ్ పెట్టిన జ‌గ‌న్ కొంత వ‌ర‌కు వారికి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అంతేత‌ప్ప బ‌హిరంగంగా ఎలాంటి ఉద్య‌మానికీ ముందుకు వ‌చ్చిందిలేదు. ఇక‌, ఇప్పుడు త‌మిళ‌నాడు జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో ఏపీ యువ‌త పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అంతేకాదు, దేశం మొత్తం దృష్టి పెట్టేలా.. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు.. వైజాగ్‌లోని ఆర్ కే బీచ్‌లో మౌన ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ‌మైంది.

అయితే, దీనికి ప్ర‌భుత్వం నుంచి ఆంక్ష‌లు వ‌చ్చేశాయి. అయినా కూడా యువ‌త ముందుకే వెళ్తామ‌ని అంటున్నారు. ఈ స‌మ‌యంలో ప్రధాన ప్ర‌తిప‌క్షంగా త‌న రోల్ ఏంటో ప్ర‌క‌టించాల్సిన స‌మ‌యంలో జ‌గ‌న్ మౌనం వ‌హిస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. యువ‌త‌కు అండ‌గా ఉంటాం.. అంటే ఏమిటి? అనే సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క‌, శాంతి యుత ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని, కొవ్వొత్తులు ప‌ట్టుకుని తిరుగుతాం అంటే.. ఏమిట‌ర్ధం అని యువ‌త ప్ర‌శ్నిస్తోంది. ఇలా అయితే.. జ‌గ‌న్  వైఖ‌రిపై సందేహాలు వెల్లువెత్తే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అత్యంత బాధ్య‌త‌గా త‌న రోల్‌ను ప్ర‌క‌టించి.. హోదాపై పోరాడాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి జ‌గ‌న్ నిర్ణ‌యం చూస్తే.. అలా లేదు!