ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?

ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ వివరణ ఇచ్చాడు.

ప్రాంతీయ నినాదాన్ని ఆయన అందుకున్నట్లు స్పష్టమవుతోందని, తాను ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పకనే చెప్పాడని విశ్లేషకులు అంటున్నారు. న‌వ‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ మౌనం వీడారు. కొన్ని రోజుల క్రితం రాజ్య‌స‌భ ప‌ద‌వికి హ‌ఠాత్తుగా రాజీనామా చేసిన ఆయ‌న త‌న ఆవేద‌న‌ను వినిపించారు. పంజాబ్‌ను వ‌దిలి వెళ్లమ‌న్నందుకే తాను రాజ్యస‌భ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు సిద్ధూ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరు ప‌ట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పంజాబ్ రాష్ట్రానికే సేవ చేయాల‌నుకుంటున్నట్లు చెప్పారు.

గ‌తంలోనూ రెండుమూడు సార్లు బీజేపీ పార్టీ  పంజాబ్ రాష్ట్రాన్ని వ‌దిలి వెళ్లమ‌ని చెప్పింద‌ని గుర్తు చేశారు. 2014లో త‌న‌ను కురుక్షేత్ర నుంచి లోక‌స‌భ కోసం పోటీ చేయ‌మ‌న్నార‌ని ఆయ‌న చెప్పారు. తాను అమృత్‌స‌ర్ నుంచే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిద్దూ త‌న పార్టీకి విన్నవించారు. బీజేపీ సభ్యుడైన సిద్ధూ రాజ్యసభ సభ్యత్వాన్ని కొద్ది రోజుల కిందటే వదులుకున్నారు. అయితే పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు.