ప్రాణాలు తీస్తున్న కాంజ్యూరింగ్‌-2

ఓ వృద్ధుడు హారర్‌ చిత్రం చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన చెన్నైలోని తిరువణ్ణామలైలో సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరువణ్ణామలైలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి థియేటర్‌లో హాలీవుడ్‌ చిత్రం కాంజ్యూరింగ్‌-2 చూడడానికి స్థానిక బాలసుబ్రమణియర్ సినిమాస్‌కు వెళ్లారు. సినిమా క్లైమాక్స్ చూస్తుండగా ఓ 65ఏళ్ల వ్యక్తి గుండె నొప్పిగా ఉందంటూ స్పృహతప్పి పడిపోయాడు.

బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అయితే మృతుడితో పాటు ఉన్న మరో వ్యక్తి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు. సదరు వ్యక్తి ఆచూకీ కోసం స్థానిక ఆటోడ్రైవర్లతో పాటూ లాడ్జ్ యజమానులను ప్రశ్నిస్తున్నారు.