బాబు ఇలాకాలో టీడీపీకి దెబ్బేస్తోందెవ‌రు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎవ‌రికి వారే ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే టాక్ విన‌బ‌డుతోంది. కొంద‌రు సీనియ‌ర్లు.. మ‌రికొంద‌రు జూనియ‌ర్లు సైతం ఆధిప‌త్యానికి పాకులాడుటుండ‌డంతో వ‌ర్గ పోరు పెరిగిపోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కౌన్సిల్‌ మీటింగ్‌లో పరస్పరం దాడులు చేసుకొంటు న్నారు. నియోజకవర్గ పరిధిలో టీటీడీ నాయకులు రెండు గ్రూపు లుగా చీలిపోయారు.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడికి కూడా ఇప్పుడు ఏమంత ప్రభావం క‌నిపించ‌డం లేదు. వైకాపా నేత రోజా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజకవర్గంలో చాలామంది టీడీపీ సీనియర్‌ నాయకులు ఉన్న‌ప్ప‌టికీ.. ముద్దు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు మాత్రం డుమ్మా కొడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా నియోజక వర్గ పరిధిలోని రెండు మార్కెటింగ్‌ కమిటీలకు నియామకాలు జరిపించలేదని సీనియర్లు గుర్రుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆ కారణంగానే ముద్దు కార్యక్రమాలకు వెళ్లకుండా నేత‌లు మొహం చాటేస్తున్నారు.

పలమనేరు నియోజకవర్గంలో పాత నాయకుడు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మళ్లీ పార్టీలోకి వచ్చారన్న మాటే కానీ పార్టీలో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జి సుబాష్‌చంద్రబోస్‌, అమరనాధరెడ్డి వర్గాలు కలవడం లేదు. అధికారుల బదిలీల్లో సైతం ఇద్దరు నేతలు వేర్వేరుగా సిఫార్సులు చేస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య దాదాపు గా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. బంగారు పాళ్యం, పూతలపట్టు, ఐరాల మండలాల్లో టీడీపీ శ్రేణులు రెండు గ్రూపులుగా చీలిపోయాయి. పార్టీ ఇన్‌చార్జి లలితకుమారి ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమవుతున్నారు.

అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే, ఆయన తండ్రి ఒక వర్గం కాగా, పార్టీ శ్రేణులు మరో వర్గంగా చీలిపోయాయి. ఎమ్మెల్యే, ఆయన తండ్రి అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ నాయకులే రచ్చకెక్కారు.కొన్ని రోజుల క్రితం మంత్రి బొజ్జల, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ చిత్తూరులోని నియోజకవర్గ నేతలందరినీ పిలిపించి రాజీ ప్రయత్నాలు చేశారు. అయినా వేడి మాత్రం చ‌ల్లార‌లేదు. సో.. ఇలా సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌లే టీడీపీని పుట్టి ముంచుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక‌, మదనపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పార్టీ మ‌రింత బ‌ల‌హీనంగా ఉంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ పార్టీకి నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ 2019 ఎన్నిక‌ల దిశ‌గా పార్టీని న‌డిపించే స్థాయిలో వారు ప‌నిచేయ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అగ్రనేతల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ఎవరూ కృషి చేసిన దాఖలాల్లేవు. అభ్యర్థుల విషయం లో పార్టీ అధిష్ఠానం చేసిన ప్రయోగాలు ప్రతిపక్షాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నేత‌లు గ్రూపులుగా విడిపోయి.. త‌మ సొంత ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డం మిన‌హా పార్టీకి చేస్తున్నది ఏమీ లేద‌ని తెలుస్తోంది. మ‌రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తారో చూడాలి.