బాబు కేబినెట్ లో వీరు సేఫ్

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌నే విష‌యం ఖాయ‌మైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడిక‌లు, తీసివేత‌ల్లో త‌ల‌మున‌క‌లైపోయారు. ఈ క్ర‌మంలో బాబు త‌న టీంలోని కొంద‌రు మంత్రుల‌ను ఎలాంటి సంకోచం లేకుండా తీసి ప‌క్క‌న పెడ‌తార‌ని టాక్ న‌డుస్తుండ‌గా.. మ‌రికొంద‌రి విష‌యంలో మాత్రం ఎలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. మ‌రి ఈ విష‌యం ఏంటో తెలుసుకుందాం.

ప్ర‌స్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మంత్రులు మంచోళ్ల‌యితే, వారి కుటుంబ స‌భ్యులు భారీ ఎత్తున లాలూచీ చేస్తున్నార‌ని, మ‌రి కొంద‌రు మంత్రులే స్వ‌యంగా తెర‌వెనుక సంగ‌తులు చ‌క్క‌బెడుతున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బాబు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రుల‌కు ఖ‌చ్చితంగా ఉద్వాస‌న ప‌లుకుతార‌ని అంటున్నారు. అయితే, కొంద‌రికి మాత్రం బాబు టీం నుంచి ఎలాంటి క‌ద‌లికా ఉండ‌ద‌ని వారు మాత్రం సేఫ్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

సేఫ్ జోన్‌లో ఉన్న‌వాళ్ల‌లో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ప‌రిటాల సునీత‌, అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణ‌మూర్తి, నిమ్మ‌కాయల చిన‌రాజ‌ప్ప‌, దేవినేని ఉమా, చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు వంటి వాళ్ల జోలికి సీఎం చంద్ర‌బాబు వెళ్ల‌ర‌ని తెలుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం వారి వారి రాజ‌కీయ, సామ‌ర్థ్య నేప‌థ్య‌మేన‌ని అంటున్నారు. య‌న‌మ‌ల ఎప్ప‌టి నుంచో బాబుకు విధేయుడిగా ఉన్నారు. ప‌రిటాల సునీత కుటుంబం మొత్తం టీడీపీకే అంకితం, అదీగాక‌, ఆధునిక టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డంలో ఆమె శాఖ ఎంత‌గానో శ్ర‌మిస్తోంది.

అదేవిధంగా మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు కూడా ఎన్నో ఏళ్లుగా టీడీపీనే అంటి పెట్టుకున్నారు. పార్టీ ప‌దేళ్లు విప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న బాబు వెంటే న‌డిచారు. అదేవిధంగా మంత్రి దేవినేని కూడా బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులే కొట్టేశారు. ఇక‌, హోం శాఖ మంత్రి చిన‌రాజ‌ప్పకు కూడా బాబు ద‌గ్గ‌ర మంచి పేరుంది. ఆయ‌న వ‌చ్చాక క్రైం రేటు త‌గ్గింద‌ని బాబు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో కొనియాడారు. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని ఎదుర్కోవ‌డంలో చిన‌రాజ‌ప్ప చొర‌వ సీఎంను క‌ట్టిప‌డేసింది.

ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లో మ‌కుటం లేని మ‌హారాజుగా వెలుగుతున్న అచ్చెన్నాయుడు కూడా త‌న కు అప్ప‌గించిన ప‌నిని పూర్తి సంతృప్తితో చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.ముఖ్యంగా అసెంబ్లీలో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డంలో అచ్చెన్నాయ‌డుకి సాటి మ‌రెవ‌రూ లేర‌నే రేంజ్‌లో ఉంది ప‌రిస్థితి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వీరంద‌నీ క‌దిలించే ప్ర‌య‌త్నం చేయ‌బోర‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.