బాబు మోడీని సేవ్ చేస్తాడా..!

ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద స‌మ‌స్య క‌రెన్సీ! కేవ‌లం 0.28% మంది ఉన్న న‌ల్ల కుబేరుల కోసం 99.73% మంది ప్ర‌జ‌లు బ్యాంకుల్లోని త‌మ ఖాతాల్లో జీతాలు, త‌దిత‌ర డ‌బ్బు ఉన్నా.. క‌నీసం ఖ‌ర్చుల‌కు సైతం చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక నానాతిప్ప‌లు ప‌డుతున్నారు. ప్ర‌ధాని మోడీ రాత్రికి రాత్రి వెల్ల‌డించిన క‌రెన్సీ స్ట్రైక్స్ న‌ల్ల కుబేరుల మాటేమో కానీ.. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా… ఏటీఎంల ముందు, బ్యాంకుల వ‌ద్ద జ‌నాల ప‌డిగాపులు పెరిగిపోయాయి.

మోడీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత మొద‌టి వారం రోజుల్లోనే ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, ఇప్ప‌టికీ అది చ‌క్క బ‌డ‌క‌పోగా.. మ‌రిన్ని చిక్కులు పెడుతుండ‌డంతో జ‌నాల్లోల చిర్రెత్తుకొస్తోంది. ఈ వేడి త‌మ దాకా సోక‌డంతో కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. మొద‌ట ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ మాట మీద నిల‌బ‌డ‌లేద‌ని, చెప్పిన స‌మ‌యానికి చిల్ల‌ర‌ను అందుబాటులోకి తేలేద‌ని ప్ర‌చారం చేసిన మోడీ.. త‌న అనుకూల సీఎంలైన చంద్ర‌బాబు వంటి వారితో నూ ఇదే ప్ర‌చారం చేయించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయినా కూడా జ‌నాలకు ఈ ఉర్జిత్ ప‌టేల్ ఎవ‌రో తెలియ‌క‌.. చేసిందంతా మోడీనే అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. దీంతో ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌ల‌హా ఇవ్వాలంటూ.. ఐదుగురు సీఎంల‌తో కూడిన క‌మిటీని మోడీ ప్ర‌క‌టించారు. దీనికి ఏపీ సీఎం, బీజేపీ మిత్ర‌ప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబును లీడ‌ర్‌గా నియ‌మించారు. వాస్త‌వానికి నోట్ల ర‌ద్దును తొలినుంచి స్వాగ‌తిస్తున్న చంద్ర‌బాబు.. త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాడ‌ని మోడీ భావించి ఉంటారు. అదేస‌మ‌యంలో బిహార్ సీఎం నితీష్‌ను, ఒడిసా సీఎం న‌వీన్‌ను ఈ క‌మిటీలో భాగ‌స్వాముల‌ను చేశారు.

దీంతో ఈ క‌మిటీపైనే ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. వాస్త‌వానికి ఎవ‌రిన‌డిగి నోట్లు ర‌ద్దు చేశార‌ని న‌వీన్ ప్ర‌శ్నించారు. ఇక‌, నితీష్ తాను క‌మిటీలో చేర‌బోన‌ని చెప్పారు. దీంతో ఇప్పుడు బాధ్య‌త అంతా చంద్ర‌బాబుపైనే ప‌డింది. ఈ ప‌రిణామంతో మోడీ.. త‌నను తాను కాపాడుకునేందుకు బాబును బాగానే వాడుతున్నార‌న్న ఫీలింగ్ వ్య‌క్తం అవుతోంది. ఏపీకి హోదా ఇవ్వ‌కుండా ప్యాకేజీతో స‌రిపుచ్చినా.. బాబు స‌ర్దుకుపోయారు. దీనికితోడు ఆయ‌నకు నేష‌న‌ల్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంది. సో.. ఇలా ఉన్న‌ప్ల‌స్‌ల‌ను భేరీజు వేసుకున్న మోడీ.. బాబును వాడుకుని.. త‌నపై పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ర‌క ప‌డ‌కుండా చేసుకోవాల‌ని ప్లాన్ వేశార‌ని అంటున్నారు. మ‌రి.. బాబు ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ చేస్తాడో చూడాలి.