బాబు వద్ద అశోక్ ప్రాధాన్యం తగ్గుతోందా..!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీకి కొత్త `క‌ళ‌` రాబోతోంద‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. ప్రాబ‌ల్యం ఈ `క‌ళ‌` ముందు చిన్న‌బోతోంద‌నే వార్త‌లు జోరందుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా క‌ళా వెంక‌ట్రావు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జిల్లా రాజకీయ‌ల్లో మ‌రో ప‌వ‌ర్ హౌస్ త‌యారైంది. దీనికి తోడు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా.. క‌ళా వెంక‌ట్రావుకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుండ‌టంతో.. అశోక్‌కు ప్రాధాన్యం క్ర‌మంగా త‌గ్గుతోంది. దీంతో ఇక సీఎం చంద్ర‌బాబు కూడా క‌ళాకే ప్రాధాన్యం ఇచ్చి.. అశోక్‌ను ప‌క్క‌న పెడుతున్నార‌నే గుస‌గుస‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుపై నమ్మకం సడలిందో, ఈయనతో భవిష్యత్‌ రాజకీయాలు చేయలేమనో, లోకేష్‌ తనకంటూ కోటరీని తయారు చేసుకుంటున్నారో తెలియదు గాని.. జిల్లా పార్టీలో కళా వెంకటరావు ప్రభావం మాత్రం అధిక‌మ‌వుతోందని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సుజయకృష్ణరంగారావును పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు మంత్రి పదవి భరోసా లభించడంతో పాటు శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం వంటి వాటిలో క‌ళా వెంక‌ట్రావు చురుగ్గా పాల్గొన‌డంతో ఆయ‌న‌కు పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలుస్తోంది. అలాగే పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌తో కూడా ఆయ‌న‌కు సన్నిహిత సంబంధాలు కూడా.. అశోక్ ప్రాధాన్య‌త త‌గ్గ‌డానికి కారణంగా తెలుస్తోంది.

శత్రుచర్ల విజయరామరాజు రాక‌తో అశోక్‌ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు బీజం పడ్డట్టు వాదనలు విన్పించాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగరావును చేర్చుకోవడం అశోక్‌కు ఇష్టం లేకపోయినా కళా వెంకటరావు పావులు కదపడంవల్లే మార్గం సుగుమం అయ్యిందనే వాదనలు ఉన్నాయి. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న‌.. అశోక్‌ బంగ్లా నుంచి పవర్‌ సెంటర్‌ను మార్చడమే దీని వెనుకున్న లక్ష్యంగా క‌ళా, లోకేష్ జోడీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది, మూడు రోజుల క్రితం ఉండవల్లిలో జరిగిన పార్టీ సమీక్ష కూడా కళా వెంకటరావు సూచన మేరకే జరిగినట్టు తెలుస్తోంది.కళా ఇచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదివి విన్పించారని కూడా తెలుస్తోంది.

కళా పదును పెట్టిన వ్యూహంలో భాగంగానే శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టు తెలుస్తోంది. జిల్లాలో శోభా హైమావతి, గద్దే బాబూరావు, ఐ.వి.పి.రాజు, త్రిమూర్తుల రాజు తదితరుల సీనియర్లు ఉన్నప్పటికీ వారెవ్వ‌రినీ పరిగణనలోకి తీసుకోలేదు. తనకంటూ వర్గాన్ని తయారు చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగా శ‌త్రుచర్లకు ఎమ్మెల్సీ ఇప్పించినట్టు వాదనలు ఉన్నాయి. ఉండవల్లి సమీక్షలో శత్రుచర్లపై అధినేతకు అశోక్‌ చేసిన ఫిర్యాదు వెనుక ఈ అక్కసు ఉందనే గుసగుసలు విన్పించాయి. భవిష్యత్‌లో సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించే విషయంలోనూ కళా పావులు కదుపుతున్నట్టు స‌మాచారం!!