బ్రేకింగ్: టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా న‌ష్ట‌పోయింది టీడీపీనే! అలాగే ఇప్ప‌టికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన ద‌గ్గ‌ర నుంచి టీఆర్ఎస్‌-టీడీపీ మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌లా ప‌రిస్థితి మారిపోయింది, మ‌రి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ క‌లిసి ప‌నిచేస్తాయని క‌ల‌లో కూడా ఊహించ‌లేం క‌దా!  కానీ ఇప్పుడు ఇలాంటి ప‌రిణామాలు రాబోతున్నాయ‌ట‌! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ క‌లిసి పోటీ చేయ‌వ‌చ్చట‌!!  తమ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిన టీఆర్‌ఎస్‌తో దోస్తీకి స్నేహ హస్తం అందించేందుకు టీడీపీ ప్రతిపాదన చేసింది.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో.. టీడీపీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందట‌. రమణ పార్టీని వీడితే జిల్లాల్లో అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరతారని, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించి.. వలసలను నిరోధించడానికి అగమేఘాల మీద దీనికి రూపకల్పన చేసింది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వ‌ర‌రావు.. టీడీపీ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చాలని భావిస్తున్నార‌ట‌, వచ్చే ఎన్నికల్లో తన జిల్లాలో టీఆర్‌ఎస్‌ విజయానికి టీడీపీతో పొత్తు అవసరమని తుమ్మ‌ల‌ భావిస్తున్నారు. అందుకే సీఎంతో స‌మావేశానికి చొర‌వ తీసుకున్నార‌ట‌.

ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ నేత, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న రాయలసీమకు చెందిన ఓ ఏపీ మంత్రితోపాటు ఓ మీడియా బాస్‌ కూడా హాజరయ్యారు. టీడీపీ ఉనికి కోల్పోతే ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్‌ చెల్లాచెదురవుతుందని, దీంతో కాంగ్రెస్‌కు లాభం చేకూరే అవకాశం ఉందని వారు విశ్లేషించారు. అలాగే అవసరమైతే బీజేపీని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుందని విందు సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడగా.. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడాల్సి ఉంటుందని కేసీఆర్‌ వ్యాఖ్యానించార‌ట‌.

కొద్దిరోజుల కిందటే ఏపీ మంత్రి నారాయణ అధికారిక నివాసంలో టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి రహస్యంగా భేటీ ఆయ్యారని సమాచారం. అదే రోజు రాత్రి రమణ, ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉండ‌గా అప్పుడే పొత్తుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకూడ‌ద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

టీడీపీ స్నేహహస్తం అందించడానికి ఓటుకు కోట్లు కేసే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యా నించ డం గమనార్హం. ఆ కేసు లేకుంటే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడేవారు కాదని, పార్టీ అగ్రనాయకత్వం సలహా మేరకే వారు టీఆర్‌ఎస్‌లో చేరారని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఆ సీనియర్‌ నేత విశ్లేషించారు. అయితే రానురానూ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని వలసలను అరికట్టడానికి ఈ విందు సమావేశం దోహదపడిందని స‌మాచారం!