మంత్రి కామినేని శ్రీనివాస్ పై సొంత పార్టీ నేతలే ఫైర్!

ఏపీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌పై సొంత పార్టీ నేత‌లే భ‌గ్గుమంటున్నారు. సొంత పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ మిత్ర‌పక్షానికి లబ్ధి చేకూరేలా చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు! త‌మ పార్టీ వారికి అన్యాయం జ‌రుగుతున్నా.. వాటిని ప‌ట్టించుకోకుండా టీడీపీకి ప్ర‌యోజనం చేకూరేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఇంకొంద‌రు మ‌రో ముంద‌డుగు వేసి.. అస‌లు ఆయ‌న బీజేపీ త‌రఫున మంత్రి అయ్యారా?  లేక టీడీపీ త‌ర‌ఫున మంత్రి అయ్యారా? అనే సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు! ప్ర‌స్తుతం ఆయ‌న‌పై ఢిల్లీ పెద్ద‌లకు ఫిర్యాదు చేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది!

నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో భాజ‌పా పెద్ద‌లు చంద్ర‌బాబుతో రాజీప‌డిపోతున్నార‌న్న విమ‌ర్శల‌కు బ‌లం చేకూర్చారు కామినేని! భాజ‌పాలో బాబు భ‌క్తిప‌రాయ‌ణుల్లో మంత్రి కామినేని ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ-బీజేపీ మ‌ధ్య అంత‌ర్గ‌తంగా కొంత గ్యాప్ ఉన్నా.. వాటిని ప‌ట్టించుకోకుండా బాబును వెనకేసుకు వ‌స్తారని ఆరోపించిన సందర్భాలున్నాయి! తాజాగా ఆయ‌న చేసిన అలాంటి కృషి ఫ‌లిత‌మే భాజ‌పా కార్య‌క‌ర్త‌ల‌కు మంట‌పుట్టిస్తోంది!

నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌మ పార్టీ వారికి అన్యాయం జ‌రుగుతున్నా ఆంధ్రా భాజ‌పా నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కిందిస్థాయి నాయ‌క‌త్వం నుంచి అసంతృప్తి తీవ్రంగా వ్య‌క్త‌మౌతోంది! ఈ మ‌ధ్య త‌మ పార్టీకి చెందిన‌ ఓ మండ‌లా ధ్య‌క్షురాలి ప‌ద‌వి విష‌యంలో కామినేని స్పంద‌న వివాదాస్ప‌దంగా మారింది, ఒప్పందం ప్ర‌కారం కైక‌లూరు మండ‌లాధ్య‌క్షురాలిగా స‌త్య‌వ‌తి రెండున్న‌రేళ్లు ఉండాలి. ఆ త‌రువాత‌, టీడీపీకి ఆ పీఠం ఇవ్వాలి. ప‌ద‌వి ముగిసినా పీఠం ఇచ్చేందుకు స‌సేమిరా అన‌డంతో టీడీపీ నేత‌లు కామినేనికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆయ‌న వెంట‌నే స్పందించి.. స‌త్య‌వ‌తిని ప‌ద‌వి నుంచి దించి టీడీపీకి ఆ స్థానాన్ని అప్ప‌గించే వ‌ర‌కూ చాలా కృషి చేశారు!

ఈ వ్య‌వ‌హారంలో జిల్లా పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిని కూడా స‌స్పెండ్ చేశారు. దీంతో స్థానిక బీజేపీ నాయ‌కులు కామినేనిపై తీవ్రంగా మండిప‌డుతున్నారు. బీజేపీకి రావాల్సిన నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో టీడీపీపై ఒత్తిడి తీసుకురావాల‌ని సూచిస్తున్నారు. ఈ విష‌యంపై పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు! మ‌రి కామినేనిపై చ‌ర్య‌లు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే!!