కబాలి ప్రొమోషన్ పీక్స్!

ఇప్పటి వరకు సినిమా పోస్టర్లు గోడలు..బస్సుల మీదే కనిపించేవి. కాని ఇప్పుడు అది విమానాలకూ పాకింది. రజినీకాంత్‌ తాజా చిత్రం కబాలీ ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డులకెక్కనుంది. దేశంలోనే తొలిసారిగా విమానాల ద్వారా ప్రచారం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమా రిలీజ్ రోజున బెంగళూరు నుండి చెన్నైకి ఎయిర్ ఏసియా ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. సినిమా విడుదల రోజు ఉదయం ఆరుగంటల పది నిమిషాలకు బెంగళూరు నుంచి బయలు దేర వెళ్లే విమానం ఏడు పదికి చెన్నై చేరుకుంటుంది. అందులోనే సినిమా టికెట్ కూడా జతకలిపారు. సినిమా చూశాక సాయంత్రం మళ్లీ మూడు గంటలకు చెన్నైలో బయలు దేరి నాలుగు గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. దీనికి మొత్తం 7860 రూపాయలను చార్జ్ చేస్తోంది. ఇదిలావుంటే, ఈ ఫ్లైట్‌ మరో పది నగరాలను కూడా కలపనుంది. వాటిలో ఢిల్లీ, గోవా, పుణె, కొచ్చి కూడా ఉన్నాయి.

ఈ విమానంలో సినిమా చూసేందుకు వెళ్లే ఫ్యాన్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, కాఫీ, టీలు, మద్యాహ్నం లంచ్, సినిమా టికెట్ , ఇంటర్వల్‌లో కూల్ డ్రింక్స్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ విమానంలోనే. ఎయిర్ పోర్ట్ నుండి థియేటర్ కి, థియేటర్ నుండి ఎయిర్ పోర్ట్ కి ట్రాన్స్ పోర్ట్ కూడా ఎయిర్ ఏషియానే భరించనుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎయిర్ ఏషియా ఫేస్ బుక్, వాట్సాప్ లో తెగ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే యాడ్ బిజినెస్ సంగతేమో కానీ పబ్లిసిటీ పరంగా మాత్రం తెగ క్లిక్ అయింది. ఈ విమానం తాలూకు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఏదేమైనా ఏయిర్ ఏషియా విమానాలపై కబాలీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్ తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేశారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క సినిమాకు మాత్రమే ఈ తరహా ఆదరణతో కూడిన ప్రచారం లభించింది. ఎయిర్ న్యూజీలాండ్ విమానసంస్థ వారు “ద హాబిట్” మూవీకి మాత్రమే విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు.

రజినీ స్టైలే వేరు. ఇక అతని అభిమానుల రూటే సెపరేట్‌. రజినీ కొత్త సినిమా ఫస్ట్‌ డే ..ఫస్ట్‌ షో చూడాల్సిందే. ఇక అది కాస్త డిఫరెంట్‌గా ఉంటే ఎలావుంటుంది?ఎంత డబ్బుకైనా వెనకాడరు. అందుకే ఎయిర్‌ ఏషియా రజనీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ క్యాష్ చేసుకుంటోంది. అతడు నటించిన తమిళ గ్యాంగ్‌స్టర్ మూవీకి ఇప్పటికే తెగ ప్రచారం వచ్చింది. కాని విడుదల మాత్రం పలు మార్లు వాయిదా పడింది. ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానలు ఎదురుచూస్తున్నారు. జులై 22న విడుదలవుతుందని బావిస్తున్నారు. సెన్సార్‌ పూర్తికాగానే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, నిరుప్పుడా సాంగ్, ఫస్ట్ పోస్టర్ లతో అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. సినిమా రిలీజ్‌ నాటికి ఇంకెంత సంచలనం రేపుతుందో ఏమో!