మళ్ళీ ముంచేసిన జానారెడ్డి.

మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని మళ్ళీ మళ్ళీ ముంచేస్తూనే ఉన్నారు. ఏ వేదిక అయినాసరే ఆయనలోని టిఆర్‌ఎస్‌ అనుకూల భావాలు చాలా తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో అయినా, పార్టీ వేదికలపైనా జానారెడ్డిది ఇదే తీరు. ప్రజలు, ఇంకా కెసియార్‌పై నమ్మకంతోనే ఉన్నారని, అందుకే కెసియార్‌ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలేదని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నేతలు ఇంకోసారి షాక్‌కి గురయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెసు నాయకులంతా విమర్శిస్తోంటే, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా పలచన చేసేలా జానారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

 ఆ సమయంలో జానారెడ్డిపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందిగానీ, సీనియర్‌ నాయకుడనే గౌరవంతో సర్దిచెప్పుకున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో కాంగ్రెసు నాయకులంతా హైదరాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమం చేపడితే, అందులో పై విధంగా కెసియార్‌ని పొగిడి జానారెడ్డి కాంగ్రెసు నాయకుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ‘పెద్దాయన’ అని జానారెడ్డికి టిఆర్‌ఎస్‌ ఇస్తున్న గౌరవం ఆయన్ని టిఆర్‌ఎస్‌ అనుకూల వ్యక్తిగా మార్చేసినట్లుంది. కానీ, కెసియార్‌ మీద అభిమానం ఉంటే టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోవచ్చుగానీ, కోవర్టులా కాంగ్రెసు పార్టీని జానారెడ్డి ముంచేయడం ఏంటట?