మాట తప్పేది లేదంటున్న కెసియార్‌

ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషనుల ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పునరుద్ఘాటించారు. గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా న్యాయస్థానాల్లో ఆ కేసులు వీగిపోయాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఇంకోసారి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ఆయన అంటున్నారు. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడానికి రెండేళ్ళకుపైగానే కెసియార్‌ సమయం తీసుకున్నారు. ఇప్పటికీ రిజర్వేషన్లపై కెసియార్‌ ఎన్నికల హామీ మాటలకే పరిమితమవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఢిల్లీలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి, వర్గీకరణను కోరుత ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలనే ఆకాంక్షను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలియజేయడం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారంటే కేంద్రం, ఆ దిశగా ఆలోచనలు చేస్తుండవచ్చు.

అలా జరిగిన పక్షంలో కెసియార్‌, తెలంగాణలోనూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడానికి ఆస్కారముంటుంది. అయితే రిజర్వేషన్లు అనే తేనెతుట్టెను కదల్చడం ఆషామాషీ విషయం కాదు. దాంతో కొత్త వివాదాలు తలెత్తుతాయి. కొత్త రాష్ట్రంలో ఈ సమస్యను కెసియార్‌ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలిక.