మైసూరా.. జేసీ.. గురించి నాటు నిజాలు చెప్పిన డీఎల్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో పార్టీలు మారిన సీనియ‌ర్ నేత‌లు, అనంత‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిలు గ‌తంలో నాటు సారా అమ్మార‌ట‌! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయార‌ట‌. న‌మ్మ‌లేకుండా ఉన్న ఇవ‌న్నీ నిజాల‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి. ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

గ‌తంలో జ‌రిగిన అనేక విష‌యాల‌ను ఈ సంద‌ర్బంగా డీఎల్ వెల్ల‌డించారు. జగన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో వేస్తున్న పిటిషన్ పై సంతకం చేయాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు తొలుత తననే సంప్రదించారని డీఎల్ బయటపెట్టారు. కానీ స్నేహితుడి కుమారుడి జీవితం నాశనం చేసే పని తాను చేయనని  చెప్పానన్నారు. పైగా జగన్‌పై కేసు వేయడం చాలా తప్పుడు పని అవుతుందని ముందే హెచ్చరించానన్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేలా తానెప్పుడు వ్యవహరించలేదని డీఎల్ చెప్పుకొచ్చారు.

ఇక‌, అప్ప‌ట్లో మైసురారెడ్డి జేసీ దివాకర్ రెడ్డి నాటు సారా వ్యాపారం చేసేవారని డీఎల్ బయటపెట్టారు. ఆ సమయంలోనే మైదుకూరులో లిక్కర్ కల్తీ జరిగి 18 మంది చనిపోయారని… దాని వల్లే జేసీ దివాకర్ రెడ్డి తాను మంత్రి పదవి పొగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే.. మైసూరాకు ప్రస్తుతం లిక్కర్ కు సంబంధించి ఎలాంటి వ్యాపారాలు లేవు కానీ దివాకరరెడ్డికి ఇప్పుడు లిక్కర్ షాపులు ఉన్నాయని.. ప్రస్తుతం నాటుసారా వ్యాపారం ఆయనకు కూడా లేదని చెప్పారు. సో.. డీఎల్‌.. చెప్పిన విష‌యాల‌పై ఆయా నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.