మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం రెండేళ్ళుగా చెబుతూ వచ్చింది. అది కూడా ఇంకా దక్కకపోవడం శోచనీయం.

 బీహార్‌ ఎన్నికల సందర్భంగా లక్షన్నర కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్రమోడీ అప్పనంగా ప్రకటించారు. కానీ అదే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. ఇదిగో ఇప్పుడు తీరిగ్గా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆర్థిక సహాయంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. చర్చలు కొలిక్కి వచ్చాక సాయంపై స్పష్టతనిస్తామని ఆయన తెలిపారు. నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లుగా కేంద్రం ప్యాకేజీ ప్రకటించడానికి ఇంకెంత కాలం వృధా చేస్తుందో ఎవరికీ తెలియరావడంలేదు. దీన్ని మోసం అనీ, దగా అనీ ఇంకేదైనా అనుకుంటే అది తప్పెలా అవుతుంది?