వైకాపాలో జగన్ సరికొత్త వ్యూహం

వైకాపాను మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మ‌రింత‌గా గ‌ళం విప్పేలా, రానున్న ఎన్నిక‌ల నాటికి క్షేత్ర‌స్థాయిలో పార్టీని మ‌రింత‌గా బ‌లం పెంచేందుకు జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహాల‌తో  ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్ర‌స్తాయి బ‌లం వైకాపాకి లేదు. ముఖ్యంగా మ‌హిళా విభాగం బ‌ల‌హీనంగా ఉంది. పైకి ఒక్క రోజా త‌ప్ప ఎవ‌రూ లేరు. అదేవిధంగా యువ‌జ‌న విభాగం కూడా పెద్దగా యాక్టివ్‌గా లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ రెండు విభాగాల‌ను బ‌లోపేతం చేస్తే.. పార్టీ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని ఆయ‌న యోచిస్తున్నాడ‌ట‌.

ఇటీవ‌ల కాలంలో ఏపీలో మ‌హిళల స‌మ‌స్య‌లు పెరుగుతుండ‌డంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా యువ‌త‌ను మ‌రింతగా త‌మ‌వైపు తిప్పుకొనేందుకు కూడా జ‌గ‌న్ భావిస్తున్నాడు. దీనికి భారీస్థాయిలో యువ‌జ‌న విభాగం, మ‌హిళా విభాగాల‌ను బ‌లోపేతం చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే యువ‌జ‌న విభాగం బ‌లోపేతానికి చ‌ర్య‌లు కూడా ప్రారంభించిన‌ట్టు స‌మాచారం. అయితే, జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు క్షేత్ర‌స్థాయిలో యువ‌జ‌న‌, మ‌హిళా విభాగాల బ‌లోపేతానికి మాట‌లు చెబితే చాల‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం అంటే.. నేత‌లు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా సాగాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే యువ‌జ‌న విభాగం, మ‌హిళా విభాగం బ‌లోపేతం కావ‌డానికి అంద‌రూ క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు న్న ప‌రిస్థితిలో జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టు అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తారా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇదిలావుంటే, ఇప్ప‌టికే ఉన్న ఎస్సీ, ఎస్టీ విభాగాల ప‌నితీరుపై జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వాళ్లు ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌ని జ‌గ‌న్ వాపోతున్నాడు.

అయితే, ఈ విష‌యంలో పైకి మాత్రం మౌనంగానే ఉన్న‌ప్ప‌టికీ.. అధికార పార్టీని నిలువ‌రించ‌డంలో అనుబంధ విభాగాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంపై మాత్రం జ‌గ‌న్ లోలోన మ‌థ‌న ప‌డుతున్నాడ‌ని అంటున్నాయి లోట‌స్ పాండ్ వ‌ర్గాలు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఆయ‌న ఆయా విభాగాలకు క్లాస్ తీసుకుంటాడ‌ని స‌మాచారం. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో అనుబంధ విభాగాల బ‌లోపేతం బాధ్య‌త‌ల‌ను వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి అప్ప‌గించాడ‌ట జ‌గ‌న్‌. మ‌రి ఆయ‌న ఏవిధంగా వాటిని బ‌లోపేతం చేస్తాడో?  జ‌గ‌న్ ఆశ‌ల‌ను ఏవిధంగా ఆయ‌న తీరుస్తాడో?  చూడాలి.